అమెరికా ట్రెజరీ విభాగం భారత్‌కు రష్యా చమురు కొనుగోలు కొనసాగించేందుకు 30 రోజుల అనుమతి ఇచ్చింది. దీంతో ప్రపంచ చమురు మార్కెట్‌లో కొత్త పరిణామంగా మారింది. ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడిన పరిస్థితుల్లో ఈ నిర్ణయం మాస్కోకు కొంత ఊరట కలిగించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా చమురు ఎగుమతులు పెరగడం వల్ల క్రెమ్లిన్ ఉక్రెయిన్ యుద్ధ ఖర్చులు భరించేందుకు సహాయపడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు 30 రోజుల అనుమతి లభించింది. మార్కెట్ ఒత్తిడి తగ్గించేందుకే నిర్ణయం అని అమెరికా ట్రెజరీ స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధి మూతతో చమురు ధరలు పెరుగుతున్నసమయంలో ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్ ఏప్రిల్ 4వ తేదీ వరకూ...
అమెరికా ట్రెజరీ విభాగం ఈ వారం వెల్లడించిన వివరాల ప్రకారం భారత్ ఏప్రిల్ 4వ తేదీ వరకు రష్యా నుంచి ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చు. అమెరికాలో పెట్రోలు ధరలపై ఒత్తిడి తగ్గించడమే ఈ నిర్ణయం లక్ష్యమని అధికారులు తెలిపారు. అయితే అమెరికా–ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ చమురు, వాయువు మార్కెట్లు మరింత కట్టుదిట్టమవుతున్నాయని ఈ పరిణామం సూచిస్తోంది. ఇందులో రష్యా చమురుపైనా ప్రభావం పడుతోంది. 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత యూరోపియన్ యూనియన్ రష్యా చమురును బహిష్కరించింది. అంతకుముందు రష్యా చమురు దిగుమతుల్లో యూరోపియన్ యూనియన్ పెద్ద వినియోగదారు. ఆ తర్వాత చైనా, భారత్ రష్యా చమురుకు ప్రధాన కొనుగోలుదారులుగా మారాయి.
చమురు ధర పెరగడంతో...
రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం సుంకం విధించారు. తరువాత ఫిబ్రవరి 6న ఆ సుంకాన్ని ఉపసంహరించుకున్నారు. భారత్ రష్యా చమురు కొనుగోలు ఆపుతుందన్న హామీ ఇచ్చిందని ట్రంప్ చెప్పారు. ఇటీవల చమురు ధరలు వేగంగా పెరిగాయి. అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ ముడి చమురు ధర శుక్రవారం బ్యారెల్‌కు 89 డాలర్లకు చేరింది. వారం క్రితం అది 73 డాలర్లకు తక్కువగా ఉంది. రష్యా యూరల్స్ చమురు ధర కూడా ఇటీవల 40 డాలర్లకు దిగువన ఉండగా ఇప్పుడు 70 డాలర్లకు చేరింది.
హోర్ముజ్ జలసంధి మూతతో...
ఇరాన్ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో హోర్ముజ్ జలసంధి మార్గంలో దాదాపు అన్ని చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. పర్షియన్ గల్ఫ్ నుంచి బయటికెళ్లే ఏకైక సముద్ర మార్గం ఇదే. ప్రపంచ చమురు అవసరాల్లో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ దేశాల నుంచి చమురు, వాయువు ట్యాంకర్లు ఈ జలసంధి గుండా ప్రయాణిస్తాయి. ప్రస్తుతం అక్కడ రవాణా నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో చమురు ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. ఇది రష్యా చమురు ఆదాయానికి తాత్కాలికంగా లాభం కలిగించే పరిస్థితి తీసుకొచ్చింది.
రష్యా ఆదాయంపై...
ఇటీవలి కాలంలో ప్రపంచ ధరలు తక్కువగా ఉండటం, పాశ్చాత్య దేశాల ఆంక్షలు కఠినమవడం వల్ల రష్యా చమురు ఆదాయం తగ్గింది. ధరల పరిమితిని తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్న ట్యాంకర్లపై కూడా ఆంక్షలు విధించారు. రష్యా పెద్ద చమురు సంస్థలు రోస్నెఫ్ట్, లూకాయిల్‌పైనా ఆంక్షలు అమల్లో ఉన్నాయి.అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ భారత్‌కు ఇచ్చిన ఈ 30 రోజుల అనుమతి రష్యా ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక లాభం ఇవ్వదని చెప్పారు. కొనుగోలుదారులు లేక ట్యాంకర్లలో నిలిచిపోయిన రష్యా చమురుకు మాత్రమే ఇది వర్తిస్తుందని వివరించారు. విశ్లేషకుల అంచనా ప్రకారం అలాంటి చమురు సుమారు 125 మిలియన్ బ్యారెల్స్ వరకు ఉండవచ్చు. “ఇరాన్ ప్రపంచ ఇంధన మార్కెట్‌ను బంధించాలన్న ప్రయత్నం వల్ల ఏర్పడిన ఒత్తిడిని ఈ తాత్కాలిక చర్య తగ్గిస్తుంది” అని బెసెంట్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పేర్కొన్నారు.
డ్రోన్ దాడి తర్వాత...
ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత ఖతార్‌లోని అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ప్లాంట్ ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయింది. దీంతో ప్రపంచ మార్కెట్‌లో లభ్యమయ్యే గ్యాస్ సరఫరాపై పోటీ మరింత పెరిగే అవకాశముంది. ఇందులో రష్యా సరఫరాలు కూడా కీలకంగా మారవచ్చు. యూరప్‌లో భవిష్యత్ గ్యాస్ ఒప్పందాల ధరలు పెరిగాయి. 2027 నాటికి రష్యా గ్యాస్ దిగుమతులు పూర్తిగా నిలిపివేయాలన్న యూరోపియన్ యూనియన్ ప్రణాళికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందన్నదే ప్రధాన అంశంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన తర్వాత ఈ సంఘర్షణ పలు దేశాలకు వ్యాపించింది.విశ్లేషకుల అంచనా ప్రకారం యుద్ధం ఒకటి రెండు వారాల్లో ముగిస్తే చమురు ధరలు మళ్లీ బ్యారెల్‌కు సుమారు 65 డాలర్లకు పడిపోయే అవకాశం ఉంది. అప్పుడు రష్యాకు పెద్దగా లాభం ఉండకపోవచ్చు. కానీ యుద్ధం ఎక్కువకాలం సాగి చమురు క్షేత్రాలు, పైప్‌లైన్లు, టెర్మినల్స్ దెబ్బతింటే ధరలు 100 డాలర్లకు పైగా చేరే అవకాశం ఉంది. అప్పుడు రష్యాకు భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
రష్యా ఆర్థిక పరిస్థితి...
రష్యా ప్రభుత్వం చమురు, వాయువు పన్నులపై గణనీయంగా ఆధారపడుతోంది. ఇవి ఫెడరల్ బడ్జెట్‌లో 20 నుంచి 30 శాతం వరకు వాటా కలిగి ఉంటాయి. జనవరిలో రష్యా చమురు, వాయువు ఆదాయం నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఆ నెలలో బడ్జెట్ లోటు 1.7 ట్రిలియన్ రూబిళ్లకు చేరింది. యుక్రెయిన్ యుద్ధం ఐదో ఏడాదిలోకి వెళ్లడంతో భారీ సైనిక ఖర్చులు ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచాయి. దీనిని ఎదుర్కొనేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పన్నులు పెంచడం, దేశీయ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం వంటి చర్యలు తీసుకున్నారు. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రష్యా చమురుకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. భారత్, చైనా తమ జాతీయ ప్రయోజనాల మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. “భారత్, చైనాతో ఇంధన రంగంలో మా సహకారం కొనసాగుతుంది. రష్యా విశ్వసనీయ సరఫరాదారు. ఒప్పందాల ప్రకారం సరఫరాలు అందిస్తాం” అని ఆయన తెలిపారు.