'ధనవంతులు నేరుగా 'సుప్రీం'కు ఎందుకు వస్తారు.?' మాజీ సీఎం పిటిషన్‌పై ధర్మాసనం సీరియస్
క్రిమినల్ కేసుల్లో ఉపశమనం పొందేందుకు ప్రభావవంతమైన వ్యక్తులు నేరుగా తమను ఆశ్రయించడాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఖండించింది.
క్రిమినల్ కేసుల్లో ఉపశమనం పొందేందుకు ప్రభావవంతమైన వ్యక్తులు నేరుగా తమను ఆశ్రయించడాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఖండించింది. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించాలని ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, ఆయన కుమారుడు చైతన్య బాఘేల్‌లను కోర్టు ఆదేశించింది. ఈ కేసులు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మద్యం కుంభకోణం, ఇతర కేసులకు సంబంధించినవి.
ఎఫ్‌ఐఆర్, అరెస్టు, రిమాండ్, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన మీ పిటిషన్లను సుప్రీంకోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్లు హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ధర్మాసనం ప్రశ్నించింది.అది కూడా రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానమే, ఈ అంశంపై తీర్పు చెప్పవచ్చు.. ఇదే మేం ఎదుర్కొంటున్న సమస్య.. ఈ అంశంపై హైకోర్టు ఎందుకు తీర్పు చెప్పలేకపోతోంది.. ఆ కోర్టుల వల్ల ఉపయోగం ఏమిటి.? ఇది ఓ ట్రెండ్ అయిపోయిందని.. ఒక ధనవంతుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. మేము మా స్టాండ్‌ను మార్చడం ప్రారంభిస్తాం. ఇది ఇలాగే కొనసాగితే సుప్రీంకోర్టులో సామాన్యులకు.. వారి న్యాయవాదులకు ఖాళీ ఉండదని వ్యాఖ్యానించింది.
పీఎంఎల్‌ఏ నిబంధనలను సవాల్ చేస్తూ భూపేశ్ బాఘేల్, చైతన్య బఘేల్‌లు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ.. దేశవ్యాప్తంగా అరెస్టుల ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు ముక్కలు ముక్కలుగా ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తూ ఎవరినైనా ఇరికించి అందరినీ అరెస్టు చేస్తున్నాయని వాదించారు. భూపేష్ బాఘేల్ తరపున హాజరైన సిబల్.. ఇది కొనసాగడానికి వీలులేదని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో గానీ, తొలి చార్జ్‌షీట్‌లో గానీ వ్యక్తుల పేర్లు లేవు, అయితే అకస్మాత్తుగా సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో వారి పేర్లు కనిపించడంతో వారిని అరెస్టు చేశారని పేర్కొన్నారు.
బాఘేల్ కుమారుడి తరఫున వాదించిన సింఘ్వీ.. రెండు మూడు చార్జిషీట్లలో తన క్లయింట్ పేరు లేదని చెప్పారు. అయితే మార్చిలో అతని ఇంటిపై అకస్మాత్తుగా దాడి జరిగింది. అతని పేరు అనుబంధ ఛార్జిషీట్‌లో కనిపించడంతో అతన్ని అరెస్టు చేశారు.