అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల చివరలో జరగాల్సిన చైనా పర్యటన వాయిదా పడే అవకాశం ఉందని సూచించారు. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు భారీగా పెరగడంతో, హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మళ్లీ సజావుగా సాగేందుకు చైనా సహకారం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. చైనా ముందుగా సహకారం ప్రకటిస్తుందా అనే విషయం తెలిసిన తర్వాతే పర్యటనపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆదివారం ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యం నుంచి వచ్చే చమురుపై చైనా ఎక్కువగా ఆధారపడుతుందని ఆయన గుర్తుచేశారు. అందువల్ల హార్ముజ్ జలసంధి ద్వారా చమురు ట్యాంకర్ల రాకపోకలు మళ్లీ ప్రారంభం కావాలంటే తాను ఏర్పాటు చేస్తున్న కొత్త అంతర్జాతీయ కూటమికి చైనా తోడ్పాటు ఇవ్వాలని కోరారు.“పర్యటనకు ముందే చైనా సహకరిస్తుందా తెలుసుకోవాలని ఉంది. అవసరమైతే పర్యటన వాయిదా పడవచ్చు” అని ట్రంప్ చెప్పారు.
ఇరాన్ యుద్ధంతో మారిన...
గత రెండు వారాల్లో అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిస్పందనలతో ప్రపంచ రాజకీయ పరిస్థితులు వేగంగా మారాయి. ఈ పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ తో జరగాల్సిన సమావేశం రద్దయితే ఆర్థిక రంగంపై ప్రభావం పడే అవకాశం ఉంది. గత ఏడాదిగా అమెరికా-చైనా మధ్య భారీ సుంకాల బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్నాయి. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్ చైనా ఉప ప్రధాని హీ లెఫెంగ్సోమవారం పారిస్‌లో వాణిజ్య చర్చలు జరిపారు. ట్రంప్ బీజింగ్ పర్యటనకు మార్గం సుగమం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్చలు నిర్వహించారు. అమెరికా-చైనా మధ్య తాత్కాలిక ఒప్పందం వల్ల పరస్పర సుంకాల విధానం నిలిచిపోయింది. అయినా ఇరుదేశాల మధ్య ఆర్థిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
జలసంధి భద్రతకు అంతర్జాతీయ సహకారం?
ఇరాన్ యుద్ధం ప్రారంభ దశలో హార్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లకు అమెరికా నౌకాదళం భద్రత కల్పిస్తుందని ట్రంప్ చెప్పారు. అయితే చమురు ధరలు పెరుగుతుండటంతో కొత్త చర్యలు పరిశీలిస్తున్నారు. ఇతర దేశాలు తమ యుద్ధ నౌకలను పంపి భద్రత కల్పించాలని అమెరికా సూచించింది. ఇప్పటివరకు ఏ దేశం అధికారికంగా అంగీకరించలేదు.ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌కు తిరిగివస్తూ విమానంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. సుమారు ఏడు దేశాలతో సైనిక సహకారం గురించి చర్చించామని చెప్పారు. అయితే ఆ దేశాల పేర్లు వెల్లడించలేదు. చైనాతో కూడా ఈ అంశంపై మాట్లాడినట్టు సంకేతాలు ఇచ్చారు.“చైనా ఆసక్తికరమైన ఉదాహరణ. గల్ఫ్ ప్రాంతం నుంచి వచ్చే చమురుపై అది ఎక్కువగా ఆధారపడుతోంది. అందుకే ‘మీరు కూడా ఈ ప్రయత్నంలో చేరాలనుకుంటున్నారా’ అని అడిగాను” అని ట్రంప్ చెప్పారు.
చమురు ధరల ప్రభావం
ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. దాంతో అమెరికాలో పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. మధ్యంతర ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న సమయంలో ఇది రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశముంది.ఇక చైనా కూడా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 2026 సంవత్సరానికి వృద్ధి లక్ష్యాన్ని 4.5 నుంచి 5 శాతం మధ్యగా నిర్ణయించింది. ఇది 1991 తర్వాత అత్యల్ప అంచనాగా భావిస్తున్నారు. హార్ముజ్ జలసంధిలో దీర్ఘకాల అంతరాయం ఉంటే చైనా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
చైనా స్పందన ఇదే...
వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి ఈ అంశంపై స్పందించారు.“హార్ముజ్ జలసంధి, దాని పరిసర సముద్ర మార్గాలు అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకం. ప్రాంతంలో భద్రత, స్థిరత్వం అందరికీ అవసరం. చమురు సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అన్ని దేశాలు బాధ్యతగా వ్యవహరించాలి” అని చెప్పారు.మధ్యప్రాచ్య దేశాలకు చైనా నిజమైన మిత్రదేశమని కూడా ఆయన పేర్కొన్నారు. వివాదంలో ఉన్న పక్షాలతో సహా సంబంధిత దేశాలతో చర్చలు కొనసాగిస్తూ ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నం చేస్తామని తెలిపారు