Iran - Israel War : ఇరాన్ యుద్ధంతో పెరుగుతున్న చమురు ధరలు

హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణా సురక్షితంగా కొనసాగాలంటే కొన్ని దేశాలు తమ యుద్ధనౌకలు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.

Update: 2026-03-16 01:48 GMT

హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణా సురక్షితంగా కొనసాగాలంటే కొన్ని దేశాలు తమ యుద్ధనౌకలు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. దాదాపు ఏడు దేశాలను ఇందుకోసం సంప్రదించినా ఇప్పటివరకు ఎలాంటి హామీ రాలేదని తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచ చమురు ధరలు పెరుగుతున్నాయి. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌కు ఎయిర్ ఫోర్స్ వన్‌లో తిరిగి వస్తూ మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. హోర్ముజ్ జలసంధిలో ప్రపంచ చమురు రవాణాలో సుమారు ఐదో వంతు జరుగుతుందని చెప్పారు. “ఈ ప్రాంతంలో ఎక్కువగా చమురు పొందుతున్న దేశాలే తమ ప్రయోజనాలను కాపాడుకోవాలి. అందుకే వారు ముందుకు రావాలని కోరుతున్నాం,” అని ట్రంప్ అన్నారు.

చైనా సహా ...
హోర్ముజ్ జలసంధి ద్వారా చైనాకు సుమారు 90 శాతం చమురు చేరుతుందని, అమెరికాకు మాత్రం చాలా తక్కువ అవసరమని ట్రంప్ చెప్పారు. అయినా భద్రత కోసం ఇతర దేశాలు కలిసి పనిచేస్తే అమెరికా సహకరిస్తుందని తెలిపారు. ఇందుకోసం చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ దేశాలను ముందుగా సంప్రదించినట్లు తెలిపారు. అయితే చైనా ఈ కూటమిలో చేరుతుందా అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ మాత్రం కొన్ని దేశాలు తమ నౌకలకు సురక్షిత మార్గం కల్పించాలని తేహ్రాన్‌ను సంప్రదించాయని చెప్పారు. “ఇది మా సైన్యం నిర్ణయించే విషయం,” అని ఆయన తెలిపారు. కొన్ని దేశాల నౌకలను వెళ్లనిచ్చామని కూడా వెల్లడించారు. అమెరికా, దాని మిత్రదేశాల నౌకలకు మాత్రం అనుమతి ఉండదని ఇరాన్ ముందే ప్రకటించింది.
యుద్ధం ముగింపు చర్చలకు..
యుద్ధాన్ని ముగించే అంశంపై అమెరికాతో మాట్లాడాల్సిన అవసరం లేదని అరఘ్చీ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ కలిసి దాడులు ప్రారంభించడంతోనే ఈ యుద్ధం మొదలైందని ఆయన అన్నారు. అణు కార్యక్రమంపై జరుగుతున్న చర్చల సమయంలోనే ఈ దాడులు జరిగాయని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన యురేనియం నిల్వలను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రణాళిక లేదని కూడా ఆయన చెప్పారు. అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ కొందరు దేశాలతో ఇప్పటికే చర్చలు జరిపామని చెప్పారు. చైనా సహకార పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే చాలా దేశాలు ఇప్పటివరకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హోర్ముజ్ జలసంధి తిరిగి తెరవడం ప్రపంచ నౌకాయానానికి ముఖ్యమని ట్రంప్‌తో చర్చించినట్లు తెలిపారు. జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వాడెఫుల్ మాత్రం “ఈ యుద్ధంలో మేము పాల్గొనే పరిస్థితి లేదు” అని స్పష్టం చేశారు.
గల్ఫ్ ప్రాంతంలో దాడులు...
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ దేశాలు కొత్తగా క్షిపణి లేదా డ్రోన్ దాడులు జరిగినట్లు వెల్లడించాయి.ఇరాన్ యూఏఈలోని మూడు ప్రధాన నౌకాశ్రయాలను ఖాళీ చేయాలని హెచ్చరించింది. అమెరికా తన చమురు కేంద్రాలపై దాడి చేస్తే అమెరికా సంబంధిత చమురు, ఆర్థిక మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని కూడా హెచ్చరించింది.యుద్ధంలో గల్ఫ్ దేశాల్లో కనీసం 12 మంది పౌరులు మరణించినట్లు సమాచారం. వారిలో ఎక్కువ మంది వలస కార్మికులే.ఇరాన్‌లో మాత్రం పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ రెడ్ క్రాస్ ప్రకారం అక్కడ 1,300 మందికి పైగా మరణించారు. వారిలో 223 మహిళలు, 202 పిల్లలు ఉన్నట్లు ఇరాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.ఇజ్రాయెల్‌లో ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇప్పటివరకు 12 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.


Tags:    

Similar News