Tamilanadu : విజయ్ అంటే ఇంత పిచ్చా... ఈ జనం ఏంటి తంబీ?

టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలకు విపరీతమైన స్పందన వస్తుంది

Update: 2025-09-22 06:17 GMT

తమిళనాడులో సినిమా హీరోలు రాజకీయ పార్టీలు పెట్టడం కొత్తేమీ కాదు. నాడు ఎంజీ రామచంద్రన్ నుంచి నేడు విజయ్ వరకూ పార్టీలు పెట్టిన వారే. అనేక మంది పార్టీలు పెట్టినా కొందరు రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. మరికొందరు మాత్రం అధికారంలోకి వచ్చారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత వంటి వారు అధికారంలోకి రాగా, విజయ్ కాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్ వంటి వారు మాత్రం రాజకీయాల్లో రాణించలేకపోయారు. జనంలో ఉన్న క్రేజ్ ను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో వారు విఫలమయ్యారు. బహిరంగ సభలకు భారీగా ప్రజలు హాజరవుతున్నా పోలింగ్ కేంద్రాలకు మాత్రం వారంతా వచ్చి ఓట్లేయకపోవడంతో అనేక మంది సినీనటులు రాజకీయాల్లో అధికారాన్ని అందుకోలేదు.

జనం పోటెత్తుతుండటంతో...
ఇప్పుడు తాజాగా టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలకు విపరీతమైన స్పందన వస్తుంది. విజయ్ కొత్తగా తమిళగ వెట్రి కజగం పార్టీ పెట్టారు. విజయ్ ఎక్కడకు వెళ్లినా ఊహించనంత రీతిలో జనం పోటెత్తుతున్నారు. ఆయన ప్రచార సభలకు వస్తున్న జనాన్ని చూసి మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఆలోచనలో పడ్డాయి. తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి పాపులర్ అయిన నటుడు విజయ్. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడు సభలు పెట్టినా జనం లక్షలాది మంది హాజరవుతున్నారు. అయితే ఈసారి విజయ్ ను కలుపుకుని వెళ్లాలని అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామి గట్టిగా పట్టుబడుతున్నారు.
కూటమి ఏర్పాటుకు...
అధికారంలో ఉన్న డీఎంకేను ఢీకొట్టాలంటే విజయ్ లాంటి క్రౌడ్ పుల్లర్ అవసరమని పళనిస్వామి భావిస్తున్నారు. కానీ బీజేపీ తో విజయ్ కలిసేందుకు అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. పళనిస్వామితో పాటు బీజేపీ రాష్ట్ర నేతలు కూడా కొందరు విజయ్ తో టచ్ లోకి వెళ్లి కూటమిగా ఏర్పడాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే విజయ్ తన జిల్లాల పర్యటనలకు వస్తున్న జనాన్ని చూసి కూటమి ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. కానీ ఎంఎన్ఎం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ మాత్రం భిన్నంగా స్పందించారు. కమల్ హాసన్ ఇప్పుడు డీఎంకేతో కలసి ఉన్నారు. బహిరంగ సభలకు వచ్చే జనమంతా ఓట్లేయరని ఆయన అనడం కూడా ఇప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన వివరించారని అనుకోవాలి.మొత్తం మీద తమిళనాడులో మాత్రం ఇప్పుడే రాజకీయాలు హీటెక్కాయి. 2026లో తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి.











Tags:    

Similar News