Tamilnadu Sampade : విజయ్ ను అరెస్ట్ చేస్తారా? న్యాయనిపుణులు ఏమంటున్నారు?

తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట జరిగిన ప్రాంతం యుద్ధభూమిని తలపిస్తోంది. విజయ్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది

Update: 2025-09-28 06:45 GMT

తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట జరిగిన ప్రాంతం యుద్ధభూమిని తలపిస్తోంది. ఎటు చూసినా చెప్పులు, నలిగిపోయిన వాటర్‌ బాటిల్స్‌, చిరిగిన పార్టీ జెండాలు, బట్టల ముక్కలు, విరిగిన కర్రలు ఇలా రకరకాల చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. ఉదయం మార్నింగ్ వాక్ కోసం బయటకు వచ్చినవారు, పాలు, కూరగాయలు తెచ్చుకునేందుకు వచ్చిన వారు రాత్రి మెగా ర్యాలీ జరిగిన ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోయారు. టీవీకే అధినేత విజయ్‌ సభ జరిగిన ఆ రహదారి రాత్రికి రాత్రే యుద్ధభూమిలా మారింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించినప్పటికీ మృతి చెందిన వారి కుటుంబాలు ఆవేదన నుంచి ఇంకా తేరుకోలేదు.

ఉదయం చూసిన వారు...
నిన్న రాత్రి ఏమైందో తెలీని చాలామంది ఉదయం ఆ దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ర్యాలీ తరువాత జరిగిన తొక్కిసలాటలో 39 మంది చనిపోయి, మరికొందరు గాయపడ్డారని విన్నపుడు మరింత షాక్‌ అయ్యారు. స్థలాన్ని పోలీసులు టేపులతో బ్లాక్‌ చేసి ఆంక్షలు పెట్టారు. అయితే అక్కడ వీడియో తీయడానికి వచ్చిన వీడియోగ్రాఫర్లు, ఫోటో జర్నలిస్టులను చూసిన వృద్ధులు… ‘‘ఇక్కడ నిజంగా తొక్కిసలాట జరిగిందా?’’ అని నమ్మలేని విధంగా ప్రశ్నించారు. ఇకపై ఏమన్నా చెప్పాలన్న ఉద్దేశ్యం టీవీకే కార్యకర్తలు, నాయకుల్లో కనిపించలేదు. వేదికపై ఇంకా పార్టీ జెండా ఎగురుతూనే ఉంది. పెద్ద పెద్ద స్పీకర్లు, లైటింగ్‌ సెట్‌లు, చినిగిన పోస్టర్లు మాత్రం నిర్లక్ష్యంగా అక్కడే పడి ఉన్నాయి.
విజయ్ అరెస్ట్ పై...
అయితే విజయ్ ను అరెస్ట్ చేస్తారా? అన్న ప్రచారం తమిళనాడులో ఊపందుకుంది. ఇప్పటికే విజయ్ పైనా టీవీకే పార్టీకి చెందిన పలువురు నేతలపై కేసులు నమోదు చేశారు. విజయ్ కూడా పార్టీ ముఖ్యనేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు. న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. తనతో పాటు నేతలను అరెస్ట్ చేస్తే ఏం చేయాలన్న దానిపై ఆయన న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. మరొకవైపు విజయ్ ను అరెస్ట్ చేస్తే శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశముందని కూడా పోలీసులు భావిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం ఇది రాజకీయ విమర్శలు చేసే సమయం కాదని, బాధితులకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రథమ కర్తవ్యం. ఘటనపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, . ఆ కమిటీ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజయ్‌ను అరెస్ట్ చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా, దాని గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు.


Tags:    

Similar News