Operations Sindoor : భారత్ - పాక్ సరిహద్దుల మధ్య కొనసాగుతున్న హైటెన్షన్
ఆపరేషన్ సిందూర్ ను జీర్ణించుకోలేని పాకిస్తాన్ భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తెగబడుతుంది.
పాకిస్తాన్ కాలు దువ్వుతుంది. కయ్యానికి సై అంటోంది. ఆపరేషన్ సిందూర్ ను జీర్ణించుకోలేని పాకిస్తాన్ భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తెగబడుతుంది. గురువారం రాత్రి ఉన్నట్లుండి అనేక ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. అయితే భారత వైమానిక దళంతో పాటు ఆర్మీ వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగారు. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ లలో యుద్ధ విమానాలతో పాక్ దాడికి ప్రయత్నించింది. భారత్ విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నించింది. ఆత్మాహుతి డ్రోన్లతో వాటిని ధ్వంసం చేయడానికి శతవిధాలా ట్రై చేసింది. అయితే భారత్ ఆర్మీ నిరంతరం అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.
ముందస్తు చర్యలు దిగడంతో...
భారత్ - పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువవుతున్నాయి. జమ్మూ లక్ష్యంగా పాక్ డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది. జమ్మూలోని ఎయిర్ సిస్టమ్ ను పాక్ లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు దిగింది. అయితే మన ఆర్మీ సమర్థవంతంగా దీనిని తిప్పికొట్టగలిగింది. పాక్ డ్రోన్లను భారత్ సైన్యం కూల్చివేయడంతో ముప్పు తప్పింది. జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలను కూడా ప్రభుత్వం బంద్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. జమ్మూ నగరాన్ని బ్లాక్ అవుట్ చేశారు. దీంతో పాటు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు భారీగా కాల్పులకు తెగపడుతున్నాయి. కిష్త్వార్, అఖ్నూర్ సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను నిలిపేశారు.
మూడు ఫైట్ జెట్లతో పాటు...
అయితే పాక్ ప్రయోగించిన మూడు ఫైటర్ జెట్లతో పాటు ఆత్మాహుతి డ్రోన్లను కూడా కూల్చివేయగలిగింది. పాక్ దాడులతో మనకు ఎలాంటినష్టం జరగలేదని భారత రక్షణ శాఖ ప్రకటించింది. పాక్ దాడులకు తెగబడటంతో ఢిల్లీలో హై అలెర్ట్ ను ప్రకటించారు. దేశ వ్యాప్తంగా అప్రమత్తం చేశారు. పాక్ మొత్తం భారత్ లోని పదిహేను చోట్ల దాడులు చేయడానికి వ్యూహం రచించింది. అయితే పాక్ వ్యూహాన్ని పసిగట్టిన భారత్ వాటిని తిప్పికొట్టగలిగింది. భారత్ కూడా పాకిస్తాన్ లో రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. జమ్మూ, ఉదంపూర్,అఖ్నూర్, పూంఛ్, రాజస్థాన్ లోని జైసల్మేర్, పో్ఖ్రాన్, పంజాబ్ లోని పఠాన్ కోట్, జలందర్ లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించింది. సత్వారా, సాంబా, ఆర్ఎస్ పురాల్లో క్షిపణి దాడులకు తెగబడింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని చెప్పారు. విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.