Independence Day : దేశ వ్యాప్తంగా ప్రారంభమైన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నేడు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రతి రాష్ట్రంలో మువ్వెన్నల జెండా ఎగురవేయనున్నారు.
నేడు 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రతి రాష్ట్రంలో మువ్వెన్నల జెండా ఎగురవేయనున్నారు. భారత జాతీయ పతాకాన్ని ఆ యా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆవిష్కరించనున్నారు. దేశ రాజధాని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను వివరించనున్నారు. నయాభారత్ ఇతివృత్తంతో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు.
ఎర్రకోటలో ప్రధాని ...
ఈరోజు ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా భద్రతను పెంచారు. కొత్త వ్యక్తుల కదలికలను పసిగట్టి అనుమానం ఉన్న వారిని అదుపులోకి ఇప్పటికే తీసుకున్నారు. ఏఐ నిఘాతో కనురెప్ప ఆర్పకుండా కాపలా కాయనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. అనుమానితులు ఉంటే ముందుగా సమాచారం ఇవ్వాలంటూ అందరికీ సమాచారం ఇచ్చారు. లాడ్జీలను, హోటళ్లను తనిఖీ చేసి మరీ నిఘాను విస్తృతం చేశారు.
పకడ్బందీగా నిఘా
ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలటరీ దళాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు వంటి వాటితో పాటు ఇతర సంస్థలు కూడా ఢిల్లీలో డేగకన్నుతో పహారా కాస్తున్నాయి. ఇక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న ఎర్రకోట వద్ద దాదాపు ఇరవై వేల మందికి పైగా భద్రతాదళాలు మొహరించాయి. ఎర్రకోటపై ప్రధాని మోదీ 12వ సారి జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పాస్ లు ఉన్న వారిని మాత్రమే అనుమతించారు. వాహనాలను కూడా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.