కాంగ్రెస్‌లో చేరాలంటే ముందుగా ఆయనను కలవాల్సిందే..!

దేశంలో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ స్పీడు పెంచింది. ఇక..

Update: 2023-09-30 04:35 GMT

దేశంలో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ స్పీడు పెంచింది. ఇక తెలంగాణలో మాత్రం సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. అధికారంలోకి రావాలంటే ఆ మాత్రం ఉండాలి కదా..! అన్నట్లు తనదైన శైలిలో అడుగులు వేస్తోంది కాంగ్రెస్‌. ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల్లో ఉన్న ముఖ్య నేతలను తమ పార్టీలోకి లాగేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. మంచి బలమున్న నాయకులపైనే కన్నేసి ఎలాగోలా పార్టీలోకి రప్పించేలా ఎత్తుగడలు వేస్తోంది. ఇక ఈ మాట అటుంచితే.. డీకే శివకుమార్‌ అనే పేరు మీరు వినే ఉంటారు. కన్నడనాట కాంగ్రెస్‌ విజయం తర్వాత ఆయన లెవల్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది.

పార్టీలో పెరిగిన ఆయన గ్రాఫ్‌ అంతా ఇంతా కాదు. ఆయన ఏం చెప్పినా జరిగి తీరాల్సిందే. అందుకే తెలంగాణ నేతలు సైతం ఆయనను ముందుగా ప్రసన్నం చేసుకుంటున్నారు. మరి ఢిల్లీ పెద్దలను కాకుండా బెంగళూరులో ఆయనను కలుసుకోవడం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఆయన అంత క్రేజ్‌ ఎందుకు పెరిగిందనేది అందరిలో నెలకొంటున్న ఆసక్తి. పార్టీలలో కొందరు ఏది చెప్పినా అది క్షణాల్లోనే జరిగిపోతుంటుంది. అలాంటి వారిలో డీకే శివకుమార్‌ కూడా. ఆయనకు అపారమైన అనుభవమే కాకుండా మంచి పలుకుబడి కూడా ఉంది. ఏదైనా చేయగలిగి సామర్థ్యం ఉన్న వ్యక్తి. దక్షణాధిలో కాంగ్రెస్‌ ఏం చేయాలన్నా ఆయన అనుగ్రహం ఉండి తీరాల్సిందే.

అధిష్టానంతో నేరుగా యాక్సెస్..

అయితే అధిష్టానానికి నేరుగా యాక్సెస్‌ ఉండటం వల్ల ఆయన వద్ద సౌత్‌ కాంగ్రెస్‌ రాజకీయాలు చేరుకుంటున్నాయి. కర్నాటకలో కాంగ్రెస్‌ విజయం దాదాపు ఆయన ఖాతాలోకే వెళ్లిందినేది జగమెరిగిన సత్యం. అభ్యర్థుల ఎంపిక నుంచి ఫండింగ్‌, గెలుపు వరకు ఆయనే చూసుకున్నారు. కాంగ్రెస్‌ పెద్దలు కూడా ఆయనకు ప్రత్యేక స్థానమిస్తున్నారు. కాంగ్రెస్‌ పెద్దలతో ఏదైనా పని ఉంటే ముందుగానే డీకే శివకుమార్‌నే కలుస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ నేతలు కూడా అదే చేస్తున్నారు. తెలంగాణ నుంచి బెంగళూరుకు క్యూ కడుతున్నారు.

గతంలో రేవంత్‌ రెడ్డి..

ఇదిలా ఉండగా, డీకే శివకుమార్‌కు ఉన్న క్రేజ్‌ వల్ల గతంలో రేవంత్‌ రెడ్డి కూడా పలుమార్లు ఆయనను కలిశారు. కాంగ్రెస్‌ నేతలే కాకుండా ఇటీవల వైఎస్‌ షర్మిల కూడా డీకే శివకుమార్‌ను కలువడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే శివకుమార్‌ తనకు ముందు నుంచే తెలుసని, ఫ్యామిలిపరంగా మంచి సంబంధాలు ఉన్నాయని, అందుకే ఆయనను మర్యాదపూర్వంగా కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని షర్మిల చెప్పుకొచ్చారు. అప్పటి నుంచే షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారన్న టాక్‌ బలంగా వినిపించింది. డీకేతో జరిగిన చర్చలు లీకుల రూపంలో బయటకు వచ్చాయి. అయితే తర్వాత దీనిపై షర్మిల క్లారిటీ ఇచ్చారు. కర్నాటక విజయంపై అభినందించడానికి తాను కలిశానని అన్నారు.

తుమ్మల నాగేశ్వరరావు..

ఇక ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే ఆయన పార్టీలో చేరకముందే తుమ్మల నాగేశ్వరరావు కూడా డీకే శివకుమార్‌ని కలిశారు. ఆయనతో చర్చల తర్వాతే పార్టీ కండువా కప్పుకున్నారు. ముందుగా ఆయనతో చర్చలు జరిపిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలోచేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.

ఇప్పుడు మోత్కుపల్లి..

క తాజాగా నిన్న మోత్కుపల్లి నర్సింహులు కూడా డీకేని కలవడం మరింత ఆసక్తికరంగా మారింది. ఆయన కూడా పార్టీ మారతారని భావిస్తున్నారు. పార్టీలో చేరడంలో భాగంగానే డీకే శివకుమార్‌ను కలిసేందుకు మోత్కుపల్లి బెంగళూరు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, ఇతర పార్టీ నేతలు వరుసగా కలవడం చూస్తే.. కాంగ్రెస్‌లో డీకేకు ఉన్న ఇమేజ్‌ ఏంటో అర్థమైపోతుంది. కర్నాటకలో పాపులర్‌ లీడర్‌ మాత్రమే కాదు.. సౌత్‌ రీజియన్‌లో కాంగ్రెస్‌కి డీకే కింగే అని చెప్పాల్సిందే.


Tags:    

Similar News