సింగర్ దివ్య దారుణ హత్య.. పాతిపెట్టిన శవాన్ని బయటకు తీశారు

సింగర్ దివ్య దారుణ హత్య.. పాతిపెట్టిన శవాన్ని బయటకు తీశారు

Update: 2022-05-24 02:51 GMT

ఢిల్లీకి చెందిన హర్యాన్వీ గాయని, నటి సంగీత అలియాస్ దివ్య ఇండోరా హత్యకు గురైంది. రోహ్తక్ జిల్లాలోని మెహమ్ సమీపంలో భూమిలో పాతిపెట్టిన సంగీత మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగీత మే 11 నుండి కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఆమె గురించి ఏమీ తెలియలేదు. కుటుంబ సభ్యులు మే 14న ఢిల్లీ పోలీసులకు ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్ కేసును కూడా పెట్టారు.

పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఓ హోటల్‌లో సంగీతతో కలిసి భోజనం చేస్తూ కనిపించిన రోహిత్ అనే యువకుడి పేరు తెరపైకి వచ్చింది. హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆల్బమ్ షూట్ చేయడానికి సంగీతను రోహిత్ ఆమె ఇంటి నుంచి భివానీకి తీసుకొచ్చాడని చెబుతున్నారు. ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేదని సంగీత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. సంగీతతో కలిసి పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు హత్య, కిడ్నాప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసులకు సమాచారం
ఆదివారం సాయంత్రం.. భైరోన్ భైని గ్రామంలోని బర్సాతి డ్రెయిన్ సమీపంలో హైవే ఫ్లైఓవర్ దగ్గర ఒకరి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు మెహమ్ పోలీసులకు సమాచారం అందింది. సమాచారం మేరకు ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందం, డ్యూటీ మేజిస్ట్రేట్‌, తహసీల్దార్‌ నేతృత్వంలో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం యువతిది అని గుర్తించారు. పోలీసులు గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పిజిఐ రోహ్‌తక్‌లోని మార్చురీలో ఉంచారు. సోమవారం ఆ యువతి మృతదేహం ఢిల్లీకి చెందిన సంగీత అలియాస్ దివ్య ఇండోరాగా గుర్తించారు.
కుటుంబ సభ్యుల ఆరోపణ ఇదే:
ఆమెతో పాటు పనిచేసిన రవి, రోహిత్‌లు ఆమెను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారని సంగీత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 11న భివానీలో ఓ ఆల్బమ్ షూటింగ్ నిమిత్తం సంగీత రోహిత్‌తో కలిసి వెళ్ళింది. మెహమ్ సమీపంలోని ఓ హోటల్‌లో రోహిత్‌తో కలిసి భోజనం చేస్తున్నప్పుడు సంగీత సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఈ కేసులో నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మెహమ్ పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News