ఢిల్లీ మునిగింది.."యమున" ఆగ్రహంతో అధికారుల అప్రమత్తం

ఉత్తర భారతదేశంలో వర్షాలు ఊపేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు పడుతున్నాయి.

Update: 2025-09-03 04:13 GMT

ఉత్తర భారతదేశంలో వర్షాలు ఊపేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. జమ్ము కాశ్మీర్, ఉత్తరాంఖండ్ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగి వందల సంఖ్య మంది గల్లంతయ్యారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఉత్తర భారత దేశంలోని హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్, ఢిల్లీల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో నీట మునిగాయి.

ప్రమాదకరమైన స్థాయిలో...
ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిలో పరుగులు తీస్తుంది. యమునా నది ప్రవాహంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాలకు వరద నీరు చేరింది. మయూర్ విహార్, యమునా నగర్ ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవహించడంతో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. యమునా నది ప్రమాదకరమైన స్థాయిలో ప్రవహిస్తున్నందున ఎవరూ నదిలో స్నానాలు చేసే ప్రయత్నం చేయవద్దని కూడా చెబుతున్నారు. అదే సమయంలో ఢిల్లీలోని అనేక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
యమునా నది గరిష్టంగా...
యమునా నది గరిష్ట నీటి మట్టం 205.33 అడుగులు కాగా, ఇప్పటికే ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద 205.8 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తుందని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందుుల పడుతున్నారు. పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కొందరు అక్కడికి వెళుతుండగా, మరికొందరు మాత్రం తమ బంధువుల ఇళ్లకు వెళ్లి తలదాచుకుంటున్నారు. పడవల్లో సురక్షిత ప్రాంతాలకు ప్రజలను అధికారులు తరలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ ప్రాణాలు పోగొట్టుకోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.


Tags:    

Similar News