BJP : మూడో సారి మోదీ సర్కార్.. ఇదే దేశం నినాదం

మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. నాగర్ కర్నూలులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు

Update: 2024-03-16 07:21 GMT

మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. నాగర్ కర్నూలులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.తెలంగాణలో రెండో రోజు ఆయన పర్యటన కొనసాగుతుంది. నల్లగొండ, నాగర్‌కర్నూలు, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులను ఆయన ప్రజలకు పరిచయం చేశారు. తెలుగులో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నికల కోడ్ అమలులోకి కాసేపట్లో రానుందన్న మోదీ, కోడ్ రాకముందే దేశ ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. తెలంగాణలోనూ ఈసారి 400 స్థానాలు దాటాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా నుంచే తెలంగాణలో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని తెలిపారు. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఆయన అన్నారు. అవినీతిపరులను శిక్షించేందుకు తమప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

నాలుగు వందల స్థానాలను...
నాలుగు వందల స్థానాలను గెలవడమే తమ లక్ష్యమని మోదీ అన్నారు. మల్కాజ్‌గిరిలో నిన్న రాత్రి జరిగిన రోడ్ షోకు కూడా ప్రజలు హాజరై బీజేపీని ఆశీర్వదించారన్నారు. మోదీని మరొకసారి గెలిపించాలని తెలంగాణ మాత్రమే కాదు దేశం మొత్తం కోరుకుంటుందన్నారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తెలంగాణలోనూ బీజేపీ గాలి వీస్తుందని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలసి తెలంగాణ కలలను ధ్వంసం చేశాయన్నారు. తెలంగాణను పదేళ్ల నుంచి బీఆర్ఎస్ లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ దృష్టి తెలంగాణపై పడిందని అన్నారు. అందుకే ఇక్కడ అభివృద్ధి జరగాలంటే బీజేపీ పార్లమెంటు అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించాలని మోదీ కోరారు. పేదలకు ఎన్నో పథకాలను అమలులోకి తెచ్చామన్నారు. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. 140 కోట్ల మంది భారతీయులే తన కుటుంబం అని ఆయన అన్నారు. ఒక్క అవినీతి పరుడు కూడా తప్పించుకోలేరని ఆయన అన్నారు.
తెలంగాణ అభివృద్ధికి...
డెబ్భయి ఏళ్లు కాంగ్రెస్ దేశాన్ని దోచుకోవడంతోనే సరిపోయిందన్నారు. మోదీ గ్యారంటీ పేరుతో తమ ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తున్నామని చెప్పారు. వేగవంతమైన మార్పు తెలంగాణలోనూ రావాలన్నారు. గత పదేళ్లలో బీజేపీ పాలనలో ఎన్నో మార్పులు తెచ్చామన్న మోదీ అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. మాదిగ రిజర్వేషన్‌లు ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. కొందరు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, లక్షలాది మంది ఇళ్లలో విద్యుత్తు వెలుగులు చూశాయన్నారు. తెలంగాణలో 87 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ కింద లబ్ది పొందారన్నారు. తెలంగాణను గేట్ వే ఆఫ్ సౌత్ అని అంటారని, ఇక్కడ అత్యధిక స్థానాలను గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణలో 67 లక్షల మంది చిరు వ్యాపారులకు ముద్ర రుణాలను అందించామన్నారు.


Tags:    

Similar News