Prasanth Kishore : ప్రశాంత్ కిషోర్ ఈసారి ఎవరి వైపు...? అదే జరిగితే?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వల్ల నష్టం జరిగేదెవరికన్న చర్చ మొదలయింది. బీహార్ శాసనసభ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదల కానుంది
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వల్ల నష్టం జరిగేదెవరికన్న చర్చ మొదలయింది. బీహార్ శాసనసభ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదల కానుంది. బీహార్ లో అధికారం దక్కించుకునేందుకు ఇటు ఎన్డీఏ, అటూ ఇండి కూటములు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే బీహార్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో గతంలో ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ కీలకంగా మారనున్నారు. ఆయన సొంత పార్టీ పెట్టుకుని ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఐ ప్యాక్ టీం బీహార్ లో ప్రశాంత్ కిషోర్ కోసం రంగంలోకి దిగింది. సోషల్ మీడియాను పీకే పార్టీ అగ్రభాగం క్యాప్చర్ చేసేసేంది. రెండు పార్టీల అధికారాన్ని బీహారీలు చూసి ఉండటంతో ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ అధికారంలోకి రాకపో్యినా ఎవరో ఒకరికి లాభాన్ని, మరొకరికి నష్టాన్ని తెచ్చి పెడుతుందని తప్పనిసరిగా చెప్పుకోవాలి.
పాదయాత్ర.. నిరసనలతో...
బీహార్ లో ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర చేపట్టారు. ప్రజాసమస్యలపై ఉద్యమిస్తున్నారు. జనసురాజ్ పార్టీని కొంత వరకూ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అయితే ఎన్డీఏ, ఇండి కూటమిని కాదని జన్ సురాజ్ పార్టీకి అత్యధిక స్థానాలను కట్టబెడతారా? అన్న అనుమానం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ పార్టీకి యువతలో ఒకింత మంచి ఫాలోయింగ్ ఉందని చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ గతంలోనూ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆయన పార్టీ బీహార్ లో మూడోస్థానానికే పరిమితమయింది. ఈసారి ఎన్నికల్లోనూ అదే స్థానం దక్కుతుందన్న అంచనాలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి. పీకే కొత్త స్ట్రాటజీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం మాత్రం వదిలపెట్టడం లేదు.
కాంగ్రెస్ కూటమికేనా?
అయితే ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ జనసురాజ్ పార్టీతో ఇండి కూటమికే నష్టమన్న విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్, ఆర్జేడీ ఓట్లను రాబట్టుకోవడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అవుతారంటున్నారు. నితీష్ కుమార్ పై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీ అండ ఉండటంతో మోదీ చరిష్మా పనిచేస్తుందంటున్నారు. మరొకవైపు తేజస్వియాదవ్ పై ఆకర్షితులయిన యువత ఇప్పుడు పీకే పంచన చేరే అవకాశముందంటున్నారు. దీనివల్ల ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు నష్టం చేకూరుతుందన్నది సర్వేల ద్వారా తెలుస్తుంది. బీహార్ లో ప్రశాంత్ కిషోర్ గేమ్ ఛేంజర్ గా మారతారంటున్నారు. మరి చివరకు ప్రశాంత్ కిషోర్ ఎవరి ఓట్లు చీల్చి తాను అధికారంలోకి రాకపోయినా మరొకరికి అధికారం తెప్పించే అవకాశాలను కొట్టిపారేయలేమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.