Bihar : లాలూ.. రంగంలోకి దిగినా.. నితీశ్ ను ఆపగలరా?

బీహార్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈరోజు నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయి.

Update: 2024-01-27 06:00 GMT

బీహార్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈరోజు నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. రేపు మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి నితీష్ కుమార్ స్కెచ్ వేశారు. రేపు శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అందరూ చెబుతున్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న నితీశ్ కుమార్ మరోవైపు బీజేపీ కూటమి వైపు చూస్తున్నారు. ఏడాది క్రితం బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఆ కూటమికి ఝలక్ ఇచ్చి ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ మరోసారి బీజేపీ కూటమికి దగ్గరవుతున్నారు.

రాజీనామా చేసి...
ఇండియా కూటమిలో తనకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారని చెబుతున్నారు. మరోవైపు కర్పూరీ ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం కూడా బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపడానికి మరో రీజన్ గా చెబుతున్నారు. గతంలోనూ ఒకరోజు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, మరుసటి రోజు ముఖ్యమంత్రి అయిన నితీశ్ కుమార్ మరోసారి ఇదే పంధాను అనుసరించనున్నారని చెబుతున్నారు. ఈసారి ఇండియా కూటమికి విడాకులిచ్చి ఎన్డీఏ కూటమితో జట్టుకట్టాలని ఆయన డిసైడ్ అయిపోయారు.
ఆఖరి ప్రయత్నంగా...
ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్జేడీకి 79, బీజేపీకి 78 మంది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. లాలూతో కలసి ఉన్న పార్టీలతో కలిపి 117 మంది మాత్రమే ఉంటారు. బీహార్ లో అసెంబ్లీ సభ్యుల సంఖ్య మొత్తం 243 మంది కాగా, మ్యాజిక్ ఫిగర్ 122. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తక్కువ అవుతారు. అయితే నితీష్ పై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలకు లాలూ ప్రసాద్ యాదవ్ వల వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు జేడీయూ, బీజేపీ ఇతర పార్టీలు కలిస్తే 128 మంది సభ్యుల బలం ఉండటంతో తమదే అధికారమన్న ధీమాలో నితీశ్ ఉన్నారు. మరి ఎవరు ఎటు వెళతారన్నది ఆసక్తికరంగా మారనుంది. మరికొద్ది గంటల్లోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News