Farmers Agitation : రైతులు పోలీసులు మధ్య యుద్ధ వాతావరణం.. రైతన్నల మరో కార్యాచరణ

ఢిల్లీ ముట్టడిని పోలీసులు కట్టడి చేయడంతో భారత్ బంద్ కు పిలుపు నివ్వాలని రైతులు నిర్ణయించినట్లు తెలిసింది.

Update: 2024-02-14 06:37 GMT

Farmers Agitation :రైతులు, పోలీసులకు మధ్య ఢిల్లీ బోర్డర్ లో ఘర్షణ వాతవరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడిని పోలీసులు కట్టడి చేయడంతో భారత్ బంద్ కు పిలుపు నివ్వాలని రైతులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెల 16వ తేదీన భారత్ బంద్ ను ప్రకటించాలని రైతు సంఘాలు నిర్ణయించినట్లు చెబుతున్నాయి. అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. నిన్నటి నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించగా, పోలీసులపై రైతులు రాళ్లు రువ్వారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించి శంభు బోర్డర్ వద్ద ఆందోళనకు దిగారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ట్రాఫిక్ ఇబ్బంది కలిగించవద్దంటూ...
కాగా రైతులు రోడ్డుపైనే బైఠాయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ఆందోళన చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని, ఆందోళన పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని కేంద్ర ప్రభుత్వం కోరింది. రైతులతో చర్చించడానికి ఇరవై నాలుగు గంటలూ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. అయినా రైతు సంఘాలు మాత్రం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాయి. తాము కూడా చర్చలకు సిద్ధమేనని, ముందు ప్రధాన డిమాండ్లకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
ప్రధాన డిమాండ్లు ఇవీ...
మార్కెట్‌ వడిదుడుకులతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు భరోసా కల్పిస్తూ చట్టం చేయాలని, 2020-21 ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, గతంలో చేపట్టిన ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలని, వివాదాస్పద విద్యుత్తు చట్టం-2020ని రద్దు చేయాలని, కేంద్రం విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేయకూడదని, భూసేకరణ చట్టం-2013ని పునర్వ్యవస్థీకరించడం, వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ నుంచి వైదొలగడం వంటి డిమాండ్లను రైతులు చేస్తున్నారు. వీటిలో కొన్నింటికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినా వారికి చట్టం రూపం తేలేదు. అందుకే మరోసారి రైతులు ఉద్యమిస్తున్నారు.


Tags:    

Similar News