మరో ఇరవై ఏళ్లకు భారత్ లో ఎయిర్ ట్యాక్సీ సేవలు

స్కైపోర్ట్జ్‌ భారత్‌ను భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌ టాక్సీ మార్కెట్లలో ఒకటిగా అంచనా వేసింది.

Update: 2026-01-30 02:04 GMT

ఆస్ట్రేలియాకు చెందిన వెర్టిప్యాడ్ డెవలపర్‌ స్కైపోర్ట్జ్‌ భారత్‌ను భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌ టాక్సీ మార్కెట్లలో ఒకటిగా అంచనా వేసింది. 2045 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 నుంచి 25 కోట్ల ప్రయాణాలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇందులో ఒక్క ఢిల్లీ నుంచే సుమారు 4 కోట్ల ప్రయాణాలు నమోదవుతాయని అంచనా వేసింది. వింగ్స్‌ ఇండియా 2026లో విడుదల చేసిన మార్కెట్‌ స్టడీ సందర్భంగా స్కైపోర్ట్జ్‌ సీఈఓ క్లెమ్‌ న్యూటన్‌-బ్రౌన్‌ మాట్లాడుతూ, భారత్‌ లో ట్రాఫిక్‌ రద్దీ తగ్గడం లేదని, ప్రయాణ సమయం ఎక్కువగా పడుతోందని, నమ్మకమైన సమయం ఆదా చేయడానికి ప్రజలు ఎక్కువగా విలువ ఇస్తున్నారని చెప్పారు.

ఢిల్లీలోనే అత్యధికంగా...
అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ మొబిలిటీ వెర్టిప్యాడ్‌ మార్కెట్‌ అధ్యయనం ప్రకారం, ఢిల్లీని ప్రారంభానికి అత్యంత అనుకూల నగరంగా గుర్తించారు. ఎక్కువ ప్రయాణ దూరాలు, పీక్‌ అవర్స్‌లో నెమ్మదిగా కదిలే ట్రాఫిక్‌, రవాణా కోసం రోడ్లపై అధిక ఆధారపడటం వంటి అంశాలను నివేదిక ప్రస్తావించింది.ఈ నివేదిక ప్రకారం 2045 నాటికి ఢిల్లీలో ఏటా సుమారు 400 మిలియన్‌ డాలర్ల ప్రయాణికుల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా దేశవ్యాప్తంగా ఇది సుమారు 2.5 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది. అదే సమయంలో దేశమంతటా 10 వేల నుంచి 15 వేల వెర్టిప్యాడ్లు అవసరమవుతాయని, ఇందులో ఢిల్లీలోనే దాదాపు 2,200 వెర్టిప్యాడ్లు ఉండాల్సి ఉంటుందని స్కైపోర్ట్జ్‌ మోడలింగ్‌ పేర్కొంది.
మరింత విస్తృతంగా...
భవనాల సంపద పెరగడం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండడం వల్ల కాలక్రమంలో ఎయిర్‌ టాక్సీ సేవలు మరింత మందికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధ్యయనం తెలిపింది. ఎయిర్‌ టాక్సీ ఖర్చులు తగ్గితే నగరాల్లోపల, సమీప నగరాల మధ్య ప్రయాణాలు మరింత పోటీగా మారతాయని నివేదిక తెలిపింది. దీంతో కొద్ది ప్రాంతాలకు పరిమితం కాకుండా మెట్రోపాలిటన్‌ ప్రాంతమంతా వెర్టిప్యాడ్లు విస్తరించే అవసరం ఏర్పడుతుందని అంచనా వేసింది. ఢిల్లీ వ్యవస్థలో ఏర్పడే వెర్టిప్యాడ్లలో సుమారు 80 శాతం నగర ప్రయాణికుల సేవలకు ఉపయోగపడతాయని, మిగిలినవి అంతర్‌నగర, ప్రాంతీయ ప్రయాణాలకు కేటాయిస్తారని పేర్కొంది. స్కైపోర్ట్జ్‌ రూపొందించిన ‘ఏరోబెర్మ్‌’ మాడ్యులర్‌ వెర్టిప్యాడ్‌ వ్యవస్థ అధిక జనసాంద్రత ఉన్న ఢిల్లీ వంటి నగరాల్లో వేగంగా ఏర్పాటు చేసేలా రూపొందించామని కంపెనీ తెలిపింది. నేలపై, భవనాల పైకప్పులపై అమర్చుకునే వీలుండి, కొద్ది డజన్ల నుంచి వేల వెర్టిప్యాడ్ల వరకు దశలవారీగా విస్తరించే అవకాశం ఉందని వివరించింది.


Tags:    

Similar News