Delhi : ఢిల్లీని వణికిస్తున్న వరదలు.. ఎటు చూసినా నీరే
ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఒడిశాల్లో దాదాపు ఇరవై నాలుగు నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి
ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఒడిశాల్లో దాదాపు ఇరవై నాలుగు నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని కేంద్ర జలసంఘం తెలిపింది. ఢిల్లీలో వరదల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక మంది అగచాట్లు పడుతున్నారు. ఉత్తర భారతంలోని 27 నదులు సాధారణం కంటే అధికంగా ప్రవహిస్తున్నాయని, ఇప్పటికే అనేక ప్రాజెక్టులకు హెచ్చరికలు జారీ చేశామని కేంద్ర జలసంఘం తెలిపింది. ఢిల్లీలో యమునా నది 207 మీటర్ల ఎత్తున ప్రవహిస్తుండటంతో ఢిల్లీ సచివాలయానికి వరద నీరు తాకింది. అరవై ఏళ్ల తర్వాత యమునా నది నీటిమట్టం ఇంత పెరగడం ఇది మూడో సారి అని చెబుతన్నారు.
ఢిల్లీలో అతలాకుతలం...
ఇప్పటికే ఢిల్లీలో 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో ఉంచి వారికి అవసరమైన సదుపాయాలు కల్పించారు. నిగమ్ బోధ్ ఘాట్, మయూర్ ఫేజ్ 2 లోకి కూడా వరద నీరు చేరింది. మయూరి ఫేజ్ 1 ఇప్పటికే నీట మునిగింది. ఢిల్లీ మెట్రో స్టేషన్ లో కూడా వరద నీరు ప్రవేశించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఢిల్లీ వాసులు చెబుతున్నారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే దారిలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. కార్యాలయాలకు వెళ్లే వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాలు నీటిలో చిక్కుకుని మొరాయిస్తున్నాయి.
ఉత్తర భారత దేశంలో...
ఇక ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్ లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాశ్మీర్ లోయతో మిగిలిన ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. జమ్మూ, శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. భారీ వరదల కారణంగా పంజాబ్, జమ్ములలో జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. మరొకవైపు హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. రోడ్లను మూసివేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోనూ వరద బీభత్సం తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాలు జలమయం కావడంతో అధికారులు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.