Delhi : ఢిల్లీలో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి
దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్ సమీపంలో సోమవారం సాయంత్రం కారు పేలుడు సంభవించింది
దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్ సమీపంలో సోమవారం సాయంత్రం కారు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందినట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే ఐదు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరాయి. ప్రాథమిక వివరాల ప్రకారం, ఈ పేలుడులో పలువురు గాయపడ్డట్లు భావిస్తున్నారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. పూర్తి సమచారం అధికారులు తెలియజేయాల్సి ఉంది. ప్రాధమికంగా అందుతున్న సమాచారం మేరకు ఈ ఘటనలో పలువురు గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమీపంలోని దుకాణాలను పోలీసులు మూసివేయిస్తున్నారు.
ఢిల్లీలో హై అలెర్ట్..
ఎర్రకోట గేట్ నెంబరు 1 ఎదురుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ఈ బాంబ్ బ్లాస్ట్ తో సమీపంలో నిలిపి ఉన్న వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. మొత్తం ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని పరిశీలిస్తున్నారు.సాయంత్రం 6.50 గంటలకు ఈ ఘటన జరిగింది. కుట్రకోణం ఉందా? లేక మరేదైనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐదు ఫైర్ ఇంజన్లు సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చాయి. ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు. దీంతో ఢిల్లీలో హై అలెర్ట్ ప్రకటించారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఎర్రకోట కు వచ్చిన పర్యాటకులతో పాటు ప్రజలు కూడా భయాందోళనలతో పరుగులు తీశారు.