Delhi : ఢిల్లీలో భారీ పేలుడు..పది మంది మృతి.. 24 మందికి గాయాలు

దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్‌ సమీపంలో జరిగిన కారు పేలుడులో కుట్రకోణం కేసులో దర్యాప్తు చేస్తున్నారు

Update: 2025-11-10 15:21 GMT

దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్‌ సమీపంలో జరిగిన కారు పేలుడులో కుట్రకోణం కేసులో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో పది మంది మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. 30 మంది ఈ ప్రమాదంలో గాయపడటంతో లోక్ పాల్ జయప్రకాశ్ నారాయణ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఐదు ఫైర్‌ ఇంజన్లు అక్కడికి చేరాయి.ఎర్రకోట మెట్రో స్టేషన్‌ వద్ద ఒక కారు వచ్చి ఆగకుండానే పేలుడు సంభవించిందని, కారులో ఉన్న వారంతా మరణించారని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. మొత్తం ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని పరిశీలిస్తున్నారు.సాయంత్రం 6.50 గంటలకు ఈ ఘటన జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

దేశమంతా హై అలెర్ట్...
ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ తో దేశమంతా హై అలెర్ట్ ప్రకటించారు. ముంబయి, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ నాకా బందీ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కనిపిస్తే పోలీసులకు సమాచారం అందివ్వాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు. హైదరాబాద్ లోనూ అనేక రద్దీ ప్రదేశాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎర్రకోట గేట్ నెంబరు 1 ఎదురుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ఈ బాంబ్ బ్లాస్ట్ తో సమీపంలో నిలిపి ఉన్న వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఐదు ఫైర్‌ ఇంజన్లు సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చాయి. ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు.
ఉదయం పేలుడు పదార్థాలను...
ఈరోజు ఉదయం హర్యానా లోని ఫరీదాబాద్‌లో సుమారు 360 కిలోల అనుమానాస్పద అమోనియం నైట్రేట్‌ అలాగే భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుుకున్నారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగిందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ-హరియాణా, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల వద్ద పోలీసు తనిఖీలు పెంచారు. రైల్వే స్టేషన్లు, మెట్రో ప్రాంగణాలు వంటి సున్నిత ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేశారు. ప్రతి జిల్లాలోని ప్రత్యేక విభాగాలు, క్రైమ్‌ బ్రాంచ్‌ యూనిట్లు అప్రమత్తంగా ఉండాలని, వాహనాలు, లాడ్జ్‌లపై ర్యాండమ్‌ తనిఖీలు చేపట్టాలని అధికారులకు సూచించారు. దేశమంతా హై అలెర్ట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.


Tags:    

Similar News