Corona Virus : అమ్మబాబోయ్.. భారత్ లో మళ్లీ కరోనా వైరస్ ఎన్ని కేసులో తెలుసా?
భారత్ లో కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది
భారత్ లో కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకూ హాంకాంగ్, సింగపూర్ కు మాత్రమే పరిమితమయిన కరోనా వైరస్ భారత్ లోకి కూడా ప్రవేశించింది. వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండటంతో ఆందోళన కలుగుతుంది. భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 2021లో కరోనా వైరస్ వ్యాప్తి చెంది అనేక లక్షల మంది మరణించిన నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఆసియా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలను తీసుకోకపోవడం ఈ పరిస్థితికి తావిచ్చిందన్న విమర్శలున్నాయి. వందల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా హాంకాంగ్, సింగపూర్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తవ్వడానికి ముందే భారత్ లోకి ప్రవేశించింది
కోవిడ్ కేసుల పెరుగుదలతో..
భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కొత్త వేరియంట్లతో ఈ కరోనా వైరస్ విరుచుకుపడుతుందని తెలిపింది. భారత్ లో ఇప్పటి వరకూ 257 కోవిడ్ కేసులు నమోదయినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపింది. భారత్ లో నమోదయిన 257 కోవిడ్ కేసుల్లో తీవ్రత కొద్దిగానే ఉందని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచి ఈ కోవిడ్ కేసులు వ్యాప్తి చెంది ఉంటాయని భావిస్తున్నారు. మే 12వ తేదీ నుంచి ఇప్పటి వరకూ కొత్తగా 164 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంటే వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని అనుకోవాలి.
తక్కువ తీవ్రత అయినా?
కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం మహారాష్ట్రలో 44 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో 69 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 34 కేసులున్నాయి. ప్రజలు ఎక్కువగా గుంపులుగా తిరిగే సమయంలో భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్ లు ధరించడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శానిటైజర్ వాడకం చేయడం మంచిదని, బయటకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ప్రస్తుతం భారత్ లో నమోదయిన కేసుల్లో తీవ్రత తక్కువగానే ఉందని, ఎవరూ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందాల్సిన పనిలేకుండానే తగ్గిపోతుందని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.