Helicopter : హెలికాప్టర్ గంటకు అద్దె ఎంతో తెలుసా? గుండె జారి.. గల్లంతవుతుందిగా
హెలికాప్టర్ల అద్దెలు భారీగా పెరిగిపోయాయి. బీహార్ ఎన్నికల్లో హెలికాప్టర్ల వినియోగం ఎక్కవయింది
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా రాజకీయ నేతలు పర్యటించడానికి ప్రత్యేకంగా హెలికాప్టర్లను వినియోగిస్తారు.ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసేందుకు హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటారు. ఎన్నికల సమయంలో వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. తక్కువ సమయంలో అన్ని ప్రాంతాలను పర్యటించి వచ్చేందుకు వీలుండటంతో ప్రస్తుత జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు ఛోటా లీడర్లు కూడా అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు సయితం హెలికాప్టర్లను అద్దెకు తీసుకుని ప్రయాణిస్తుండటం సర్వసాధారణమయింది. తాజాగా బీహార్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది.
రెండు కూటములకు చెందిన..
బీహార్ లో ఎన్డీఏ కూటమిలోని పార్టీలతో పాటు మహాఘట్ బంధన్ కు చెందిన నేతలు కూడా హెలికాప్టర్లను ముందుగా బుక్ చేసుకుంటున్నారు. ఇంకా సీట్ల కేటాయింపులో స్పష్టత లేకపోయినప్పటికీ హెలికాప్టర్లు మళ్లీ దొరకవేమోనని పార్టీల నేతలు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చిబుక్ చేసుకుంటున్నారు. పాట్నా తో పాటు వివిధ విమానాశ్రయాల్లో హెలికాప్టర్ల మెయిన్ టెయిన్స్ కోసం కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే ఎన్నికల సమయం కావడంతో హెలికాప్టర్ అద్దె ధర మామూలుగా లేదట. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఏ, మహా ఘట్ బంధన్ కు చెందిన పార్టీలు ఆరు హెలికాప్టర్లు మాత్రమే వినియోగించాయంటున్నారు. అయితే ఇప్పుడు మాత్రం రెండు కూటములు దాదాపు ఇరవైకి పైగా హెలికాప్టర్లను వినియోగించే అవకాశముంది.
అద్దెలు అమాంతం పెరిగినా...
ఈ మేరకు ముందుగా బుక్ చేసుకున్న పార్టీ నేతలు తమ పార్టీకి చెందిన అగ్రనేతల కోసం అడ్వాన్స్ లు కూడా చెల్లిస్తున్నారు. హెలికాప్టర్ అద్దె కూడా పార్టీ ఎన్నికల వ్యయంలో పడుతున్నప్పటికీ పెద్దగా లెక్క చేయకుండా ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. దీంతో హెలికాప్టర్ల అద్దె మరింత పెరిగిపోయింది. ఎన్డీఏ కూటమి దాదాపు పదమూడు హెలికాప్టర్లను బుక్ చేుకుంది. మహాఘట్ బంధన్ కు చెందిన పార్టీలు ఐదు హెలికాప్టర్లు ఇప్పటి వరకూ బుక్ చేసుకున్నారట. అయితే డబుల్ ఇంజిన్ హెలికాప్టర్ల అద్దె గంటకు నాలుగు లక్షల రూపాయల వరకూ ఉండగా, సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ అద్దె రెండు లక్షలు పలుకుతుందట. వీటికి తోడు అదనంగా జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. అయినా లెక్క చేయకుండా పార్టీలు ఎక్కువ ధర చెల్లించి హెలికాప్టర్లను అద్దెకు తీసుకునేందుకు అడ్వాన్స్ లు ఇచ్చేసినట్లు సమాచారం.