చేపలు పట్టే వ్యక్తి పోలీసు కస్టడీలో మృతి.. ఏకంగా పోలీసు స్టేషన్ కే నిప్పు

ఈ సంఘటన హింసాత్మక నిరసనలకు దారితీసింది. కోపోద్రిక్తులైన సమూహం ఏకంగా

Update: 2022-05-23 12:23 GMT

శనివారం సాయంత్రం అస్సాంలోని నాగోన్‌లో పోలీసు స్టేషన్ లో ఓ వ్యక్తి కస్టడీలో మరణించాడు. ఈ సంఘటన హింసాత్మక నిరసనలకు దారితీసింది. కోపోద్రిక్తులైన సమూహం ఏకంగా పోలీసు స్టేషన్‌కు నిప్పుపెట్టింది, ముగ్గురు పోలీసు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిని కొట్టి, పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించే ముందు దానిని ధ్వంసం చేసింది. అయితే అసోంలోని నాగావ్ అధికారులు బటాద్రాబా పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టిన వారి ఇళ్లను కూల్చివేసింది.

పోలీసు స్టేషన్‌కు నిప్పుపెట్టిన ఐదు కుటుంబాల ఇళ్లను అధికారులు ఆదివారం కూల్చివేశారు. సలోనబరి గ్రామానికి చెందిన సుమారు 40 మంది వ్యక్తుల గుంపు శనివారం మధ్యాహ్నం డింగ్ సర్కిల్‌లోని బటాద్రాబా పోలీస్ స్టేషన్‌లోని కొంత భాగానికి నిప్పంటించారు, స్థానిక చేపలు అమ్మే వ్యక్తి సఫీకుల్ ఇస్లామ్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత అతను మృతి చెందడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి మృతిపై జిల్లా యంత్రాంగం ఆదివారం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. బటాద్రాబా స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారిని పోలీసులు సస్పెండ్ చేశారు. మూక దాడిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ని ఏర్పాటు చేశారు.

ఇక ఆదివారం ఉదయం, బుల్డోజర్లు పోలీస్ స్టేషన్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి చేరుకున్నాయి. పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టడంలో పాల్గొన్న వారిలో చట్టవిరుద్ధంగా కట్టుకున్న గృహాలను కూల్చివేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కేసుకు సంబంధించి నాగావ్ పోలీసులు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి మరో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 14 మంది మహిళలు ఉన్నారు.

అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా గోస్వామి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సిబామోని బోరాతో కలిసి నాగోన్‌లోని డింగ్ ప్రాంతంలోని హైదుబీ, సల్నాబరి గ్రామాలను సందర్శించింది.

Tags:    

Similar News