థర్డ్ వేవ్ పై ఐఎంఏ కీలక ప్రకటన.. చర్యలు తీసుకోకపోతే ఇక అంతే

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ.. ఐఎంఏ కీలక ప్రకటన చేసింది.

Update: 2021-12-07 11:57 GMT

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ.. ఐఎంఏ కీలక ప్రకటన చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులపై కేంద్రం పునరాలోచించాలని ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్స్, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని, అలాగే 12 - 18 ఏళ్ల లోపు పిల్లలకు టీకాలు వేసే ప్రతిపాదనను కేంద్రం వేగంగా పరిశీలించాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. వ్యాక్సినేషన్ విషయంలో ఎంత జాప్యం చేస్తే.. థర్డ్ వేవ్ ముప్పు అంత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని ఐఎంఏ వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశంలోని ప్రధాన నగరాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 24 వరకూ నమోదయ్యాయి.

వేగంగా...
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ వేరియంట్ కు వేగంగా ప్రబలే లక్షణం ఉందని, ఎక్కువ మంది దీనికి ప్రభావితం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు ఐఎంఏ పేర్కొంది. కోవిడ్ మొదటి, రెండవ వేవ్ ల తర్వాత ఇప్పుడిప్పుడే కార్యకలాపాలన్నీ సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఇది పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని, ఇప్పట్నుంచి ఒమిక్రాన్ ను ఎదుర్కొనే చర్యలు చేపట్టకపోతే.. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ భారీ స్థాయిలో ఉంటుందని, వ్యాక్సినేషన్ ను వేగవంతం చేస్తే తప్ప ఈ ముప్పును ఎదుర్కోలేమని హెచ్చరించింది. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ, డెల్టా వేరియంట్ కన్నా 5-10 రెట్లు వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని, దీని దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా అంటువ్యాధిని నియంత్రించే చర్యలు చేపట్టాలని సూచించింది.


Tags:    

Similar News