అజెండా బయటపడేది అప్పుడేనట

పార్లమెంటు సమావేశాలకు కేంద్రం సిద్ధమవుతుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో కీలక నేతలు భేటీ అయ్యారు.

Update: 2023-09-13 12:34 GMT

పార్లమెంటు సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో కీలక నేతలు భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించారు. పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమర్థవంతంగా సమాధానాలను చెప్పాలని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఏ ఏ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలో ముందుగానే నిర్ణయించి వారిచేత ధీటుగా మాట్లాడించాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.

17న అఖిలపక్షం...
ఈ సమావేశాల్లో కీలకమైన అంశాలను ఆమోదించే ప్రయత్నం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సమావేశాల అజెండా ఏంటన్నది ఇంకా బయటకు రాలేదు. అయితే ఈ నెల 17వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశంలో అజెండాను బయటపెడతారని చెబుతున్నారు. ఇండియా పేరును భారత్ గా మార్చడంతో పాటు జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి వంటి బిల్లులు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది.


Tags:    

Similar News