సినిమా రివ్యూ: లైగర్

ఎప్పటి నుండో ఎదురుచూసిన విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన లైగర్ సినిమా

Update: 2022-08-25 09:37 GMT

తారాగణం: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, ఆలి, గెటప్ శీను, మైక్ టైసన్ తదితరులు

కెమెరా: విష్ణు శర్మ
ఎడిటింగ్: జునైద్ సిద్దికి
సంగీతం (బ్యాక్ గ్రౌండ్): సునీల్ కాశ్యప్
నిర్మాతలు: కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి
దర్శకత్వం: పూరి జగన్నాథ్
విడుదల తేదీ: 25 ఆగస్టు 2022
ఎప్పటి నుండో ఎదురుచూసిన విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన లైగర్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియన్ చిత్రం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథతో రూపొందింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లైగర్‌ సినిమా విడుదలైంది. ధర్మ ప్రొడక్షన్స్-పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించాయి. కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్, రిలీజ్ చాలా ఆలస్యమైంది. ఇందులో మైక్ టైసన్, రమ్య కృష్ణన్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈరోజు విడుదలైన సినిమా మూవీ లవర్స్ ను మెప్పించిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
సినిమా కథ:
కరీంనగర్‌కు చెందిన బాలమణి (రమ్యకృష్ణ) తన కొడుకు లైగర్‌ (విజయ్ దేవరకొండ)ను మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఛాంపియన్ చేయాలనుకొంటుంది. అందుకోసమే ముంబైకు వస్తుంది. ఈ క్రమంలో ముంబైలోని మార్షల్ ఆర్ట్స్ కోచ్‌ (రోనిత్ రాయ్) వద్ద లైగర్‌ను చేర్పిస్తుంది. గొడవ లైగర్‌ను మొదటి చూపులోనే తానియా (అనన్య పాండే) ప్రేమిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల లైగర్‌ ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. ఈ బ్రేకప్ లైగర్ పై ఎలాంటి ప్రభావం చూపించింది.. అమ్మ కోరిక మేరకు లైగర్ గొప్ప ఎంఎంఏ ఛాంపియన్ అయ్యాడా లేదా అనేది సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది.
నటీ నటులు:
విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీకి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది.. కానీ ఈ సినిమాలో హీరోకు నత్తి ఉన్నట్లు చూపించడం వలన డైలాగ్స్ లేకుండా పోయాయి. యాక్టింగ్ పరంగా విజయ్ దేవరకొండ చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక సినిమాకు ప్లస్ అవుతుందన్న రమ్య కృష్ణ.. కొన్ని సీన్లలో మైనస్ గా కనిపించింది. హీరోయిన్ అనన్య పాండే కూడా నెగటివ్ అనే చెప్పుకోవచ్చు. ఇక మొదటి సారి ఒక ఇండియన్ సినిమాలో మైక్ టైసన్ నటిస్తూ ఉన్నాడంటే ఒక రేంజి బిల్డప్ ఉంటుంది. హైప్ కు తగ్గట్టుగా మ్యాచ్ అచ్చే సీన్స్ తో పూరీ వస్తాడని అనుకున్నారు. కానీ కామెడీ చేయించేశాడు. ఇక అలీ కామెడీ కూడా సినిమాకు పెద్దగా ప్లస్ అవ్వలేదు. మిగిలిన వాళ్లు.. అందుకు తగ్గట్టుగా తమ పని కానిచ్చేసి వెళ్లిపోయారు.
మిగిలినవి:
కెమెరా పని తనం చాలా బాగుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని కొన్ని సందర్భాల్లో బాగున్నా.. మిగిలిన చోట్ల తేలిపోయింది. ఫైట్ సీన్స్ ను చాలా బాగా కంపోజ్ చేశారు. ఎంతో సాదా కథతో పూరీ ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడని ఎవరూ అనుకోలేదు. ఫైటింగ్ బేస్డ్ సినిమా అంటే క్లైమాక్స్ లో ఒక టోర్నమెంట్ ను హీరో గెలుస్తాడనే విషయం ఎవరికైనా తెలిసిందే..! అందుకు భిన్నంగా ఈ సినిమా క్లైమాక్స్ ను కంపోజ్ చేసినప్పటికీ ప్రేక్షకులకు ఎక్కడం కష్టమే..! ఇక ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్ లో సాగే సమయంలో కనీసం కింద తెలుగు సబ్ టైటిల్స్ కూడా వేయలేదు. మైక్ టైసన్ మీద పెట్టుకున్న అంచనాలు తేలిపోయాయి. ఒకప్పుడు మైక్ టైసన్ తన మ్యాచ్ లో ప్రత్యర్థి చెవి కొరుకుతాడు.. ఈ సినిమాలో హీరో మైక్ టైసన్ చెవిని కొరుకుతాడు.. ఒకప్పుడు మైక్ టైసన్ చేసిన ఈ పని గురించి తెలిసిన వాళ్లకు మాత్రమే క్లైమాక్స్ లో వచ్చే సీన్ విలువ తెలుస్తుంది. అలా చాలా విషయాల్లో తెలుగు ఆడియన్స్ ను మరచిపోయి పాన్ ఇండియా సినిమా తీసేసినట్లు అనిపిస్తుంది.

ఫైనల్ గా.. 'తెలుగోళ్లని మరచిపోయి సినిమా తీశాడా పూరీ' అని అనిపించకమానదు.


Tags:    

Similar News