Raviteja : రవితేజ "మాస్ జాతర" తో హిట్ కొట్టాడా? ఫట్ మనిపించాడా?
మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ మాస్ జాతర విడుదలయింది.
మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ మాస్ జాతర విడుదలయింది. రవితేజ హిట్ కొట్టి చాలా రోజులయింది. ఈ మూవీపై ఆయన అభిమనులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భాను భాగవతుపు దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన ఈ మూవీ నిన్ననే ప్రీమియర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మాస్ జాతర రవితేజ అభిమానులను మరోసారి నిరాశపర్చిందని చెప్పాలి. సినిమా ప్రమోషన్లపై ఉన్న శ్రద్ధ మేకింగ్ లో పెట్టలేదన్న విమర్శలు వినపడుతున్నాయి. ఈ మూవీలో రవితేజ రైల్వే ఎస్ ఐగా కనిపించారు. కథలో కొత్తదనం లేకపోవడం మరింత నిరాశకు గురి చేసింది.
రవితేజ గతంలో నటించిన...
రవితేజ గతంలో నటించిన టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ తర్వాత వరుస ఫ్లాప్‌లతో ఉన్న రవి తేజ అభిమానులకు మాస్ జాతర మూవీతో తిరిగి హిట్ ఇస్తానన్న మాట నిలబెట్టుకోలేకపోయాడు. భాను బొగ్గవరపు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సాధారణ పోలీస్ కథలానే సాగిపోతుంది. ఇలాంటి కధలు గతంలో ఎన్నో వచ్చాయి. రైల్వే పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా రవి తేజ రైల్వే ప్లాట్‌ఫాం నుంచే నేరాలపై పోరాడే సన్నివేశాలే కథా నేపథ్యంగా సాగాయి. క్రాక్ సినిమాలోని పోలీస్ కథ, ప్రతీకార తాలూకు సన్నివేశాలను మళ్లీ తీసుకురావడంతో చిత్రానికి కొత్తదనం కనిపించదు.
పాత ఫార్ములాతోనే...
యాక్షన్ సీన్స్ కొంత ఉత్సాహాన్నిస్తే, కథనం మాత్రం పూర్తిగా పాత పద్దతిలో సాగుతుంది. శ్రీలీలతో ఉన్న ప్రేమ ట్రాక్, రాజేంద్రప్రసాద్ పాత్రలతో ఉన్న కుటుంబ ఎమోషన్ ప్రభావం చూపలేదు. హాస్యంలో కూడా పంచ్ లు పడలేదు. శ్రీలీలా స్క్రీన్‌పై ఆకట్టుకున్నా, డ్రగ్ పెడ్లర్‌గా ఆమె పాత్రకు ప్రాధాన్యం లేకుండా పోయింది. నరేష్, మురళీశర్మ, సముద్రఖని పాత్రలు సాదారణ స్థాయిలోనే ఉన్నాయి. ప్రతినాయకుడిగా నవీన్ చంద్ర కాస్త నిరుత్సాహపరిచాడు. వరంగల్‌లో ఆరంభమైన కథ అనంతరం ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాలకు మారి డ్రగ్ మాఫియాపై హీరో పోరాటం చూపించినా, థ్రిల్ లేకుండా సాగిపోతుంది. పాటలు, డ్యాన్స్ నంబర్లు కూడా ‘ధమాకా’లోని ఎనర్జీ లేకుండా చేశాయి. ‘విక్రమార్కుడు’, ‘క్రాక్’, ‘వాల్టేర్ వీరయ్య’ తరహాలో మరోసారి పోలీస్ అవతారంలో కనిపించినా, ఈసారి రవి తేజకి స్క్రీన్‌ప్లే అండగా నిలవలేదు. కథ, కామెడీ, ఎమోషన్ అన్నీ ఎక్కడో మాయమయ్యాయి. మొత్తంగా ‘మాస్ జాతర’ పాత ఫార్ములాలో వేసిన కొత్త సినిమా మాత్రమే.