భూమికి చైనా పెద్ద రంధ్రాన్ని ఎందుకు పెడుతోంది?

మొదటిది చమురు నిల్వల కోసమని చైనా చెబుతూ ఉన్నా.. రెండోది మాత్రం న్యాచురల్ గ్యాస్ కోసమని అంటున్నారు. భూమి లోపల ఏముందో

Update: 2023-07-22 10:34 GMT

భూమి పొరల్లోకి వెళ్లాలని చైనా భావిస్తూ ఉంది. భూమి క్రస్ట్‌లోకి 10,000 మీటర్ల లోతు డ్రిల్లింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన కొద్ది నెలల కిందట చైనా ప్రారంభించగా.. చైనా నైరుతి ప్రావిన్స్ సిచువాన్‌లో రెండవ అల్ట్రా-డీప్ డ్రిల్లింగ్ వెంచర్‌ను ప్రారంభించింది. చైనాలో అత్యంత లోతైన బోరుబావిని తవ్వే మొదటి ఆపరేషన్ ఈ ఏడాది మేలో మొదలైంది. చమురు సమృద్ధిగా ఉన్న జిన్‌జియాంగ్ ప్రాంతంలోని తారిమ్ బేసిన్‌లో ఈ పనిని చైనా ప్రారంభించింది. చైనా నేషనల్ పెట్రోలియం కార్ప్ (CNPC) సిచువాన్ ప్రావిన్స్‌లోని షెండి చువాన్కే లో 10,520 మీటర్ల (సుమారు 6.5 మైళ్లు) లోతుకు తవ్వాలని అనుకుంటూ ఉంది.

మొదటిది చమురు నిల్వల కోసమని చైనా చెబుతూ ఉన్నా.. రెండోది మాత్రం న్యాచురల్ గ్యాస్ కోసమని అంటున్నారు. భూమి లోపల ఏముందో తెలుసుకోవాలనే ప్రయత్నమే కాకుండా.. సహజవాయువుల గురించి కూడా తెలుసుకోవాలని చైనా ప్రయత్నమని అంటున్నారు నిపుణులు. వార్తా సంస్థ జిన్హువా ప్రకారం, చైనా భూమి పొరల్లో సహజ వాయువు నిల్వలను పరిశోధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. చైనా ఎలక్ట్రిక్ పవర్ న్యూస్ స్టేట్ న్యూస్ అవుట్‌లెట్ ప్రకారం.. చువాన్కే-1 ప్రాజెక్ట్ అన్వేషణ, డీప్ ఎర్త్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్‌లో ఒక భాగం. చైనా శాస్త్రీయ పరిశోధన, చమురు- గ్యాస్ వనరుల గురించి తెలుసుకోడానికి ముఖ్యమైన మద్దతు అందిస్తుందని చెబుతున్నారు. అల్ట్రా-డీప్ డ్రిల్లింగ్ లతో ఏకంగా 9,000 మీటర్ల లోతుకు చేరుకోవచ్చు.
సిచువాన్ లో మొదలైన ప్రయోగం ముఖ్యంగా సహజవాయువు కోసమేనని చైనా చుబుతోంది. సిచువాన్‌లోని ప్రస్తుత ప్రాజెక్ట్ ప్రధానంగా అల్ట్రా-డీప్ నేచురల్ గ్యాసెస్ నిల్వలను కనుగొనడానికి ఉద్దేశించింది. ప్రధానంగా డ్రిల్లింగ్ పద్ధతులను పరీక్షించడం, భూమి అంతర్గత నిర్మాణంపై డేటాను సేకరించడం కూడా ఈ ప్రాజెక్టులో భాగమేనని అంటున్నారు. ఇంధన కొరత, భౌగోళిక రాజకీయ అశాంతి, ప్రపంచవ్యాప్త ధరల హెచ్చుతగ్గులకు ప్రతిస్పందనగా దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది.
10,000 మీటర్ల దిగువన ఉన్న భౌగోళిక సమాచారాన్ని సేకరించడం తమ లక్ష్యమని నిపుణులు చెబుతూ ఉన్నారు. ప్రాజెక్ట్ డిప్యూటీ మేనేజర్ డింగ్ వీ మాట్లాడుతూ, "10,000 మీటర్ల లోతైన ఈ ప్రాజెక్ట్ లూనార్ ఎక్స్ ప్లోరేషన్ ప్రాజెక్ట్‌తో పోల్చదగిన ప్రాజెక్ట్." అని తెలిపారు.
చైనాలోని షేల్ గ్యాస్ నిక్షేపాలకు నిలయం సిచువాన్
చైనాలో షేల్ గ్యాస్ నిక్షేపాలు ఎక్కువగా సిచువాన్ లో ఉన్నాయి. అద్భుతమైన లొకేషన్స్ కు, అరుదైన జంతువులకు సిచువాన్ నిలయం. అక్కడి భౌగోళిక పరిస్థితుల కారణంగా, ఈ వనరులను పొందడం కష్టంగా మారింది. సినోపెక్ చమురు కూడా చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో సహజ వాయువుల నిక్షేపాల కోసం వెతుకుతూ ఉంది. పుగ్వాంగ్, యువాన్బా, చువాన్సీ లలో గ్యాస్ క్షేత్రాలు కనుగొన్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.
చువాన్కే-1 ప్రాజెక్ట్‌ను పెట్రోచైనా సౌత్‌వెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్‌ఫీల్డ్ కంపెనీ నిర్వహిస్తుంది. డ్రిల్లింగ్ విజయవంతమైతే కొత్త సహజ వాయువు నిల్వలు ఉన్న ప్రాంతంగా మారబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సవాళ్లు
భూమి పొరల లోపలికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత భారీగా పెరిగిపోతూ ఉంటుంది. ఇక ఉపరితలం నుండి 10,000 మీటర్ల దిగువన అంటే అత్యంత వేడిగా ఉంటుంది. ఇదే అతి పెద్ద ఛాలెంజ్. ఇక పీడనం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత లోతైన మహాసముద్రం మరియానా ట్రెంచ్ లో 138 మెగాపాస్కల్స్ పీడనాన్ని కలిగి ఉంటుంది. ఇక భూమి లోపల 224 డిగ్రీల సెల్సియస్ (435 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత కంటే చాలా ఎక్కువ ఉంటుంది. అంత లోతు డ్రిల్లింగ్ చేయడం పెద్ద సాహసమే కాకుండా.. చాలా సవాళ్లతో కూడుకున్నది.


Tags:    

Similar News