అప్పుడు కోహ్లీతో కప్ ఇప్పుడేమో!!

17 ఏళ్ల క్రితం కౌలాలంపూర్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు విజేతగా నిలిచింది.

Update: 2025-10-07 13:30 GMT

17 ఏళ్ల క్రితం కౌలాలంపూర్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు విజేతగా నిలిచింది. ఆ జట్టులో కీలక పాత్ర పోషించిన తన్మయ్ శ్రీవాస్తవ, అజితేశ్‌ అర్గల్ మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టారు. అంపైర్లుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. 2008లో జరిగిన ఆ ప్రపంచకప్‌లో ఎడమచేతి వాటం ఓపెనర్ అయిన తన్మయ్ శ్రీవాస్తవ 262 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, మీడియం పేసర్ అజితేశ్‌ అర్గల్ ఫైనల్‌లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. వీరిద్దరూ కాన్పూర్‌లో జరిగిన భారత్ 'ఏ', ఆస్ట్రేలియా 'ఏ' జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో బీసీసీఐ నిర్వహించిన అంపైరింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తన్మయ్, అజితేశ్‌, ఇప్పటికే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ వంటి దేశవాళీ టోర్నీలలో అంపైరింగ్ చేశారు. ఇప్పుడు భారత్ 'ఏ' సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం భారత అంపైర్లలో నితిన్ మీనన్ మాత్రమే ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో ఉన్నారు. మొదట ఐసీసీ ఎమిరేట్స్ ప్యానెల్‌కు, ఆ తర్వాత ఎలైట్ ప్యానెల్‌కు ఎంపికవ్వాలని ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Tags:    

Similar News