సముద్రం ఆ దేశాన్ని తినేస్తోంది
వాతావరణ మార్పులు ఈ ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానికి ఈ ఘటన కూడా ఒక నిదర్శనం.
వాతావరణ మార్పులు ఈ ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానికి ఈ ఘటన కూడా ఒక నిదర్శనం. ఏకంగా ఒక దేశ జనాభా యావత్తూ తరలిపోవాల్సి వస్తోంది. తువాలు దేశీయులు తమ సొంత గడ్డ శాశ్వతంగా విడిచిపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ద్వీపదేశానికి మూడువేల సంవత్సరాల సాంస్కృతిక వైభవం ఉంది. హవాయ్, ఆస్ట్రేలియాల నడుమ పసిఫిక్ మహా సాగరంలో తొమ్మిది ద్వీపాలతో కూడిన ఈ దేశం కొన్ని దశాబ్దాల్లోనే పూర్తిగా కనుమరుగు కానుంది. సముద్ర జలాలు ఆ దేశాన్ని మింగేస్తున్నాయి. తువాలు భూభాగం సముద్ర మట్టానికి కనిష్ఠంగా 6.6అడుగులు, గరిష్ఠంగా 15అడుగుల ఎత్తులో ఉంది. అంతా కలిపి 25.14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 10,643 మంది జనాభా. వాతావరణ మార్పుల వల్ల తుపానుల ఉద్ధృతి, సముద్ర మట్టం పెరుగుతుంటే, అలల తాకిడికి నేల కోసుకుపోతోంది. తాగునీటి వనరులు ఉప్పునీటితో కలగలిసిపోతున్నాయి. వ్యవసాయం, జీవనోపాధులు దెబ్బతిన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఆ దేశ వాసులు సొంత గడ్డను వదిలేయాల్సి వస్తోంది. రాబోయే రోజుల్లో ఎన్నో నగరాలకు, ఎన్నో దేశాలకు ఈ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.