ఇంటెల్.. వారికి ఊహించని షాక్

Update: 2022-10-12 08:35 GMT

ప్రముఖ చిప్ మేకింగ్ సంస్థ 'ఇంటెల్ కార్ప్' తమ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇటీవలి కాలంలో పర్సనల్ కంప్యూటర్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉద్యోగులను తగ్గించే దిశగా ఇంటెల్ అడుగులు వేస్తోంది. హెడ్‌కౌంట్‌ పరంగా భారీ తగ్గింపును ప్లాన్ చేస్తోంది, ఇది వేలల్లో ఉండవచ్చని భావిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం.. ఉద్యోగుల తొలగింపులు త్వరలోనే ప్రకటించనున్నారు.. సేల్స్, మార్కెటింగ్ గ్రూప్‌తో సహా ఇంటెల్ లోని ఇంకొన్ని విభాగాలకు చెందిన 20% మంది సిబ్బందిని తొలగించవచ్చని నివేదిక పేర్కొంది. ఉద్యోగుల తొలగింపుపై ఇంటెల్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాకున్నా.. జులై నెలలో ఆ సంస్థ ప్రకటించిన సేల్స్‌ గణాంకాలే కారణమని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. పీసీల వినియోగం తగ్గిపోవడం ఇంటెల్ పై ఊహించని ప్రభావం చూపించనుంది. బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసిన జులై రిపోర్ట్‌లో ఇంటెల్‌ లో మొత్తం ఉద్యోగులు 113,700 మంది పనిచేస్తున్నారు. పీసీ మార్కెట్‌లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా ఇంటెల్‌ 20శాతం మంది ఉద్యోగుల్ని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి.


Similar News