గూగుల్ ని నమ్ముకుంటే కారు గాల్లో తేలింది!!
గూగుల్ మ్యాప్స్ దారి చూపిస్తాయి కదా అని గుడ్డిగా నమ్మేసి వెళితే ప్రమాదాలు తప్పవు.
గూగుల్ మ్యాప్స్ దారి చూపిస్తాయి కదా అని గుడ్డిగా నమ్మేసి వెళితే ప్రమాదాలు తప్పవు. గతంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. మరి కొందరు తృటిలో తప్పించుకున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని వెళ్లి ఫ్లై ఓవర్ ఎక్కాక ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. లక్నో నుంచి ఓ వ్యక్తి గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ కారులో వస్తున్నాడు. గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ ఫరెందాలోని గోరఖ్‌పూర్-సోనౌలి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌పైకి కారును తీసుకెళ్లాడు. ఆకస్మాత్తుగా ముందు ఓ గొయ్యిని చూసి వెంటనే బ్రేక్ వేశాడు. అంతే కారు గాల్లో వేలాడుతూ ఆగిపోయింది. ఈ ప్లైఓవర్లో ఒక భాగం పూర్తిగా నిర్మించారు. మరోవైపు నిర్మాణం జరగలేదు. పైవంతెన చూడడానికి సాధారణ రహదారిలా కనిపిస్తుండడంతో పాపం ఆ కారు డ్రైవర్ అక్కడికి వచ్చేశాడు. సమాచారం అందించిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నట్లు ఫరెందా పోలీసులు క్రేన్ సాయంతో ఆ కారును అక్కడి నుంచి తొలగించారు. కనీసం నో ఎంట్రీ బోర్డు కూడా లేకపోవడంపై ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.