62 ఏళ్ల వయసులో ఐసెట్ రాసి.. ర్యాంకులు కొట్టి
డాక్టర్ కావాల్సిన కుమారుడు, తోడుగా ఉన్న భార్య నెలల వ్యవధిలోనే మరణించినా ఆయన వాటన్నింటిని అధిగమించి ఐసెట్‌లో రెండు సార్లు ర్యాంకు సాధించారు.
డాక్టర్ కావాల్సిన కుమారుడు, తోడుగా ఉన్న భార్య నెలల వ్యవధిలోనే మరణించినా ఆయన వాటన్నింటిని అధిగమించి ఐసెట్‌లో రెండు సార్లు ర్యాంకు సాధించారు. ఇటీవల విడుదలైన ఐసెట్ ఫలితాల్లో 178 వ ర్యాంకు తెచ్చుకున్నారు. చిన్నచిన్న కష్టాలకే తీవ్ర ఒత్తిడికి గురవుతున్న నేటి యువతకు తన విజయం ద్వారా ఆదిలాబాద్‌కు చెందిన రావుల సూర్యనారాయణ స్ఫూర్తినిచ్చారు.
టీచర్స్‌కాలనీకి చెందిన రావుల సూర్యనారాయణ ఎల్‌ఐసీలో అధికారి. భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, పెద్ద కుమారుడు శశాంక్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, చిన్నకుమారుడు శరణ్ మెడిసిన్ సీట్ సాధించాడు. 2020లో సూర్యనారాయణ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. కొంతకాలానికే చిన్న కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. కరోనాతో భార్య మరణించారు. ఈ బాధను దిగమింగిన ఆయనకు పరీక్షల్లో విఫలమయ్యామని యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే వార్తలు కలచి వేశాయి. భావితరాలకు ప్రాణాల విలువను తెలియచెప్పాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం వయోపరిమితి లేని ఐసెట్ పరీక్ష రాస్తున్నారు. తొలి ప్రయత్నంలో 1,828 ర్యాంకు తెచ్చుకున్నారు. మలి ప్రయత్నంలో ఈ సారి ఏకంగా 178 ర్యాంకు సాధించారు.