వరి సాగులో బాతులు ఎంతో సాయం చేస్తాయట. పొలాల్లో తిరుగుతూ రైతులకు ఎంతో సాయం చేస్తున్నాయి. పంట మోళ్లు, కీటకాలు, కలుపు మొక్కలన్నిటినీ బాతులు తినేస్తాయి. పురుగులు, కలుపు మొక్కలను తినడం ద్వారా ఆ తర్వాత వేసే పంటకు చీడపీడల బెడద చాలా వరకు తగ్గించడానికి బాతులు సహాయపడుతున్నాయి. థాయిలాండ్, వియత్నాం తదితర దేశాల్లో జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది.
వరి పొలాల్లో ముఖ్యంగా వరి కోతల తర్వాత బాతులు తిరుగాడుతుంటాయి. అనేక వారాల పాటు తిరుగుతూ పురుగూ పుట్ర, కలుపు, పురుగులను తింటాయి. ఆ తర్వాత వేసే వరి పంటకు బలాన్నిస్తాయి. బాతులు పొలాల్లో తిరిగే సమయాల్లో అవి విసర్జించే రెట్ట నేలను నత్రజని తదితర సహజపోషకాలతో సారవంతం చేస్తుంది. కలుపు మొక్కల్ని తినెయ్యటంతో పాటు బాతులు నేలను గోళ్లతో తిరగేస్తాయి. పంట మొక్కల వేర్లకు గాలి తగిలేలా చేస్తాయి. బాతులు ఎంతో మేలు చేస్తూ ఉండడంతో విదేశాల్లోనూ వరి సేద్యంలో కీలక భూమికను పోషిస్తున్నాయి.