జిప్ లైన్ మీద వెళుతుండగా.. అనుకోని ప్రమాదం
హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీకి వేసవి సెలవుల కోసం వెళ్ళిన ఓ కుటుంబానికి ఊహించని ప్రమాదం పలకరించింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీకి వేసవి సెలవుల కోసం వెళ్ళిన ఓ కుటుంబానికి ఊహించని ప్రమాదం పలకరించింది. జూన్ 8న 10ఏళ్ల త్రిషా బిజ్వే జిప్‌లైన్ మీద వెళుతూ ఉండగా, జిప్‌లైన్ కేబుల్ అకస్మాత్తుగా తెగిపోవడంతో సుమారు 30 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో త్రిష కాలి ఎముకలు విరిగిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. త్రిషకు తొలుత మనాలీలో ప్రాథమిక వైద్యం అందించి.. అనంతరం ఆమెను చండీగఢ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నాగ్ పూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని, ప్రమాదం తర్వాత సహాయం అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.