Iran - Israel War : ఇజ్రాయిల్ - అమెరికా క్షిపణులతో దాడి.. ఇరాన్ ప్రతీకార దాడులు

ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం పథ్నాలుగో రోజుకు చేరుకుంది.

Update: 2026-03-14 02:19 GMT

ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం పథ్నాలుగో రోజుకు చేరుకుంది. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం మధ్య అమెరికా సైన్యం శుక్రవారం పెర్షియన్‌ గల్ఫ్‌లోని ఖార్గ్‌ దీవిపై ఉన్న సైనిక స్థావరాలపై బాంబుదాడులు చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌ చమురు ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ దీవిలోని లక్ష్యాలను అమెరికా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయని ఆయన తెలిపారు. అవసరమైతే అక్కడి చమురు మౌలిక వసతులపై కూడా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఖార్గ్‌ దీవి ఇరాన్‌ చమురు ఎగుమతులకు కీలక కేంద్రం. ఒక రోజు ముందే ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహ్మద్ బఘేర్ ఖాలిబా అలాంటి దాడి జరిగితే తీవ్ర ప్రతీకారం తీసుకుంటామని హెచ్చరించారు.

టెహ్రాన్‌లో భారీ పేలుడు...
ఇరాన్‌ రాజధాని టెహ్రాన్ లోని ఫిర్దౌసీ స్క్వేర్‌ వద్ద శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. పాలస్తీనీయులకు మద్దతుగా నిర్వహించిన వార్షిక ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. అక్కడే పేలుడు చోటుచేసుకుంది. ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్‌ ముందే హెచ్చరించింది. ఇరాన్‌ ఇంటర్నెట్‌ను దాదాపు పూర్తిగా నిలిపివేయడంతో ఇజ్రాయెల్‌ ఇచ్చిన హెచ్చరికను చాలామంది చూడలేకపోయారు. పేలుడు సమయంలో ఇరాన్‌ న్యాయవ్యవస్థ అధిపతి ఘోలాంహోస్సేన్ మొహసేని ఎజెయ్ ర్యాలీలో పాల్గొంటూ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. “ఈ క్షిపణుల వర్షం మధ్య కూడా ఇరాన్‌ వెనక్కి తగ్గదు” అని ఆయన చెప్పారు.
హోర్ముజ్‌ జలసంధి మూసివేత...
ఇరాన్‌ ఇజ్రాయెల్‌ సహా గల్ఫ్‌ దేశాలపై క్షిపణులు, డ్రోన్‌లతో దాడులు కొనసాగిస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన హోర్మోజ్ జలసంధిని ఇరాన్‌ దాదాపు మూసివేసింది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదవ వంతు ఈ మార్గం గుండా వెళ్లుతుంది. ఇక మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధవిమానాలు ఇరాన్‌లోని సైనిక స్థావరాలు సహా పలు లక్ష్యాలపై వరుస దాడులు కొనసాగిస్తున్నాయి. యుద్ధ పరిస్థితి కొనసాగుతుండటంతో అమెరికా మరిన్ని సైనిక బలగాలను మధ్యప్రాచ్యానికి పంపుతోంది. అమెరికా నౌకాదళానికి చెందిన అమ్ఫిబియస్‌ దాడి నౌక యూఎస్ఎస్ ట్రిపోలితో పాటు సుమారు 2,500 మంది మెరైన్లను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.యునైటెడ్ స్టేట్స్ మెరైన్ కార్పొరేషన్ కు చెందిన 31వ మెరైన్‌ ఎక్స్‌పిడిషనరీ యూనిట్‌ కూడా ఈ బలగాల్లో ఉంది. ఈ యూనిట్‌ అవసరమైతే సముద్ర మార్గం నుంచి దిగిపడి చర్యలు చేపట్టగలదు. అయితే భూమిపై యుద్ధ చర్యలు తక్షణం చేపడతారనే అర్థం కాదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ తో పాటు ఎనిమిది డిస్ట్రాయర్లు అరేబియా సముద్రంలో మోహరించాయి.
లెబనాన్‌లో సంక్షోభం...
ఇజ్రాయెల్‌ దాడులతో లెబనాన్ లో పరిస్థితి విషమించింది. ఇరాన్‌కు మద్దతు ఉన్న హజ్బుల్లా పై ఇజ్రాయెల్‌ వరుస దాడులు చేస్తోంది. ఇప్పటివరకు దాదాపు 800 మంది మరణించగా, 8.5 లక్షల మంది నిర్వాసితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే ప్రశ్నకు స్పందించారు. “నాకు లోపల నుంచి అలా అనిపించినప్పుడు యుద్ధం ముగుస్తుంది” అని ఆయన చెప్పారు. అయితే ఆయుధాలు లేని ప్రజలు ఇరాన్‌ ప్రభుత్వాన్ని కూల్చడం కష్టమేనని కూడా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలను అణచివేయడంలో ఇరాన్‌ పరామిలిటరీ బసీజ్‌ దళాలు కీలక పాత్ర పోషించాయని చెప్పారు.ఇరాక్‌లో అమెరికాకు చెందిన KC-135 ఇంధన సరఫరా విమానం కూలిపోవడంతో ఆరుగురు సిబ్బంది మరణించారు. దీంతో యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా మరణాల సంఖ్య కనీసం 13కి చేరింది. ఇక అమెరికా రక్షణ మంత్రి చెప్పిన దాని ప్రకారం యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటివరకు ఇరాన్‌లో 15 వేలకుపైగా లక్ష్యాలపై దాడులు జరిగాయన్నారు.


Tags:    

Similar News