Israel - Iran War : మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావం ఆందోళనలో ఆసియా దేశాలు
మధ్యప్రాచ్యంలో యుద్ధం విస్తరించడంతో ఆసియా దేశాలు దాని ప్రభావంతో అప్రమత్తమవుతున్నాయి
మధ్యప్రాచ్యంలో యుద్ధం విస్తరించడంతో ఆసియా దేశాలు దాని ప్రభావంతో అప్రమత్తమవుతున్నాయి. ముఖ్యంగా కొరియా ద్వీపకల్పం, జపాన్, చైనా దేశాలు ఆర్థిక దెబ్బలు, దీర్ఘకాల భద్రతా ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా చర్యలపై మిత్రదేశాల్లో అప్రమత్తత వ్యక్తమవుతోంది. ఆర్థికంగా సవాళ్లు, భద్రతపరమైన చర్యలపై పై చర్చ జరుగుతుంది.
ఉత్తర కొరియాలో ...
గత నెల జరిగిన కీలక రాజకీయ సమావేశంలో ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ దేశం దశాబ్దాలుగా కొనసాగిస్తున్న అణ్వాయుధ కార్యక్రమం “సరైన నిర్ణయం” అని చెప్పారు. తీవ్రమైన ఆంక్షలు, వనరుల కొరత ఉన్నా అణ్వాయుధాల అభివృద్ధి తప్పు కాదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఈ నమ్మకాన్ని మరింత బలపరిచే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమెనీ మృతి చెందడం ఉత్తర కొరియా నాయకత్వాన్ని అప్రమత్తం చేసినట్టు భావిస్తున్నారు. దీనికి ముందు జనవరిలో అమెరికా నిర్వహించిన ఆపరేషన్‌లో వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను పట్టుకున్నారు. ఇరాన్‌పై దాడులు చట్టవిరుద్ధమని, దేశ సార్వభౌమత్వానికి తీవ్రమైన అవమానం అని ప్యాంగ్యాంగ్ విదేశాంగ శాఖ ఖండించింది. అయితే ఖమెనీ మరణంపై ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. దక్షిణ కొరియాలోని జాతీయ ఐక్యత సంస్థకు చెందిన విశ్లేషకుడు హాంగ్ మిన్ మాట్లాడుతూ ఉత్తర కొరియా నాయకత్వంపై ఇలాంటి దాడి జరగడం చాలా ప్రమాదకరమని అన్నారు.
అణ్యాయుధాలను...
ఇరాన్‌తో పోలిస్తే ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది. దాని వద్ద డజన్ల కొద్దీ అణ్వార్హెడ్లు ఉన్నాయి. ఆసియాలోని అమెరికా మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకునే క్షిపణులు, అమెరికా భూభాగానికీ చేరగల క్షిపణులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి జరిగే ముందస్తు దాడులతో ఉత్తర కొరియా అణ్వాయుధ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్మూలించడం కష్టం. మిగిలిపోయే క్షిపణి వ్యవస్థలు దక్షిణ కొరియా, జపాన్ లేదా అమెరికాపై దాడులకు ఉపయోగించే ప్రమాదం ఉంటుందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన తరువాత మొదటిసారి ప్రజల ముందుకు వచ్చిన కిమ్ జోంగ్ ఉన్ గత వారం కొత్త యుద్ధ నౌక సముద్ర పరీక్షలు పరిశీలించారు. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న క్రూయిజ్ క్షిపణుల పరీక్షలు కూడా పరిశీలించినట్టు ప్రభుత్వ మీడియా తెలిపింది. ఖమెనీ హత్య, ఇరాన్ నౌకాదళంపై అమెరికా చర్యల తరువాత తమ సైనిక శక్తిని చూపించేందుకే ఈ ప్రదర్శన చేసినట్టు కొందరు విశ్లేషకులు అంటున్నారు.
ఉత్తర కొరియాపై దాడి కష్టమే...
ఉత్తర కొరియాపై దాడి చేయడం మరో కారణంతో కూడా క్లిష్టమే. చైనా, రష్యా దేశాలకు అది భౌగోళికంగా దగ్గరగా ఉంది. ఈ రెండు దేశాలు అమెరికాకు ప్రధాన ప్రత్యర్థులు. ఇటీవల కిమ్ జోంగ్ ఉన్ ఈ దేశాలతో సంబంధాలను మరింత బలపరుస్తున్నారు. ఇరాన్, వెనిజులాపై అమెరికా చర్యలు చర్చలు కొనసాగుతున్న సమయంలోనే జరిగాయి. దీంతో అమెరికాతో చర్చలు కొనసాగించాలా అనే విషయంలో ఉత్తర కొరియా ఆలోచన మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2019లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కిమ్ జోంగ్ ఉన్ సమావేశం విఫలమైన తర్వాత రెండు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయి. అయితే ఫిబ్రవరిలో జరిగిన పార్టీ సమావేశంలో అమెరికాతో సంభాషణకు తలుపు మూయలేదని కిమ్ తెలిపారు. ముందుగా అణ్వాయుధాల విరమణ చేయాలన్న షరతును అమెరికా తీసేయాలని ఉత్తర కొరియా కోరుతోంది. ఇరాన్‌పై దాడి వల్ల అమెరికాపై కిమ్ నమ్మకం మరింత తగ్గే అవకాశముందని హాంగ్ మిన్ అన్నారు. చర్చలకు కొత్త షరతులు పెట్టే అవకాశం కూడా ఉందని చెప్పారు. అయితే సియోల్‌లోని ఇవా ఉమెన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పార్క్ వోన్ గోన్ అభిప్రాయం భిన్నంగా ఉంది. ట్రంప్‌తో ఒప్పందం చేసుకోవాలనే అత్యవసర భావన కిమ్‌కు పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.మార్చి చివర లేదా ఏప్రిల్‌లో ట్రంప్ చైనా పర్యటన జరగవచ్చని దక్షిణ కొరియా అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో ప్యాంగ్యాంగ్‌తో కొత్త చర్చలకు అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.
దక్షిణ కొరియాలో ఆందోళన...
వాణిజ్యం, దిగుమతి ఇంధనంపై అధికంగా ఆధారపడే దక్షిణ కొరియా ఇరాన్ చర్యలపై ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా ఇంధన మౌలిక వసతులపై దాడులు, హోర్ముజ్ జలసంధిని మూసివేయాలన్న ప్రయత్నాలు సియోల్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా వెళ్తుంది. ఈ యుద్ధం అమెరికాతో ఉన్న రక్షణ ఒప్పందంపై కూడా దక్షిణ కొరియాలో కొత్త చర్చలకు దారి తీసింది. మిత్రదేశాలతో విస్తృత సమన్వయం లేకుండానే అమెరికా సైనిక చర్యలకు దిగుతుందనే భావన పెరుగుతోంది. దశాబ్దాలుగా అమెరికా తన మిత్రదేశాలకు పూర్తి సైనిక రక్షణ హామీ ఇస్తోంది. దక్షిణ కొరియాలో సుమారు 28 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఈ భద్రతా వ్యవస్థ తగ్గే అవకాశం తక్కువే అయినా, అమెరికా ఏకపక్ష చర్యల వల్ల తాము ఇతర యుద్ధాల్లో ఇరుక్కునే ప్రమాదాన్ని సియోల్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.
జపాన్ లోనూ ...
ఆసియాలో మరో ముఖ్యమైన అమెరికా మిత్రదేశమైన జపాన్ కూడా ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది. హోర్ముజ్ జలసంధి మూసివేత జరిగితే ఇంధన సరఫరాపై ప్రభావం ఉంటుందని టోక్యో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించేందుకు అమెరికా ప్రయత్నాలకు జపాన్ మద్దతు ఇచ్చినా, తాజా యుద్ధం చట్టబద్ధతపై సందేహాలు పెంచిందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మిత్రదేశంగా ఎంతవరకు విశ్వసనీయమనే ప్రశ్న కూడా చర్చకు వచ్చింది. జపాన్ ప్రధానమంత్రి సనయే తకైచి అమెరికా-ఇరాన్ చర్చలకు మద్దతు తెలిపారు. అయితే అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రత్యక్ష మద్దతు ఇవ్వలేదు. యుద్ధంలో సైనికంగా పాల్గొనే ఉద్దేశం టోక్యోకు లేదని సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి జపాన్ సైనిక శక్తి పెంపు, ఆయుధాల విక్రయాల విస్తరణపై ప్రభుత్వ ప్రయత్నాలకు బలం ఇవ్వొచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
చైనా తన ప్రభావాన్ని పెంచుకునేలా...
ఇరాన్ యుద్ధాన్ని మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని పెంచుకునే అవకాశంగా చైనా చూడవచ్చని నిపుణులు అంటున్నారు. అమెరికా కంటే విశ్వసనీయ మధ్యవర్తిగా తాను నిలబడాలని బీజింగ్ ప్రయత్నించవచ్చు.వెనిజులా, ఇరాన్ దేశాలు చైనాకు ప్రధాన చమురు సరఫరాదారులు. ఈ రెండు దేశాలపై అమెరికా చర్యలు చైనాను కూడా లక్ష్యంగా పెట్టుకున్నవే కావచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు.గల్ఫ్ దేశాలతో వాణిజ్య, సాంకేతిక సంబంధాలను పెంచుతున్న చైనా ఇప్పటికే ప్రాంతీయ ప్రభావం పెంచే ప్రయత్నాలు చేస్తోంది. 2023లో ఇరాన్-సౌదీ అరేబియా మధ్య సంబంధాలు సాధారణీకరణకు బీజింగ్ మధ్యవర్తిత్వం చేయడం దీనికి ఉదాహరణ. అయితే యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే చైనా వాణిజ్య ప్రయోజనాలకు నష్టం కలగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో అమెరికా యుద్ధ విధానాలను అధ్యయనం చేసి సైన్యంలో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని వేగవంతం చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.