North Korea : ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు....దగ్గరుండి పర్యేక్షించిన కిమ్
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి యుద్ధనౌక నుంచి ప్రయోగించిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి పరీక్షలను పరిశీలించారు.
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి యుద్ధనౌక నుంచి ప్రయోగించిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి పరీక్షలను పరిశీలించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా బుధవారం తెలిపింది. అమెరికా–దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా స్పందిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరీక్షలు జరిగాయి. ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన చిత్రాల్లో కిమ్ జోంగ్ ఉన్, అతని కుమార్తె సమావేశ మందిరంలో కూర్చొని పెద్ద తెరపై క్షిపణుల ప్రయోగాన్ని చూస్తున్నట్లు కనిపించింది. ఈ క్షిపణులు ఏడాది క్రితం సేవలోకి వచ్చిన నౌకాదళ విధ్వంసక నౌక నుంచి ప్రయోగించారు.
కుమార్తెను వారసురాలిగా...
మంగళవారం వీడియో ద్వారా క్షిపణి ప్రయోగాలను కిమ్ జోంగ్ ఉన్ గమనించారని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. “బలమైన, నమ్మదగిన అణు యుద్ధ నిరోధ శక్తిని కొనసాగించడం అవసరం” అని ఆయన చెప్పినట్లు పేర్కొంది. ఈ నివేదికలో ఆయన కుమార్తె గురించి ప్రస్తావించలేదు. కిమ్ కుమార్తెగా భావిస్తున్న కిమ్ జు ఏ e వయసు సుమారు 13 సంవత్సరాలు అని సమాచారం. 2022 చివరి నుంచి ఆమె సైనిక పరేడ్‌లు, ఆయుధ పరీక్షలు వంటి కీలక కార్యక్రమాల్లో తండ్రితో కలిసి కనిపిస్తోంది. గత నెల దక్షిణ కొరియా గూఢచారి సంస్థ ఆమెను వారసురాలిగా ప్రకటించే దిశగా కిమ్ జోంగ్ ఉన్ అడుగులు వేస్తున్నారని అంచనా వేసింది. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వివరాల ప్రకారం క్షిపణులు ఉత్తర కొరియా పశ్చిమ తీరానికి సమీపంలోని లక్ష్య దీవులను తాకాయి. నౌకాదళం వ్యూహాత్మక దాడి సామర్థ్యాన్ని చూపడం, సైనికులకు ఆయుధ వినియోగంపై పరిచయం కల్పించడం ఈ ప్రయోగాల ఉద్దేశమని కిమ్ జోంగ్ ఉన్ చెప్పారు.
ఫ్రీడమ్ షీల్డ్ విన్యాసాలు...
గత వారం కూడా అదే నౌక నుంచి క్రూయిజ్ క్షిపణి పరీక్షలను కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే ఆ సమయంలో ఆయన కుమార్తె కనిపించలేదు. అమెరికా–దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభమైన తర్వాతే మంగళవారం ఈ క్షిపణి ప్రయోగాలు జరిగాయి. ఈ విన్యాసాలను ఉత్తర కొరియా దాడికి ముందస్తు సాధనగా చూస్తోంది. ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ సోదరి, ఉన్నత అధికారి కిమ్ యో జోంగ్ మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు. ఈ విన్యాసాలు అమెరికా, దక్షిణ కొరియాలకు ఉత్తర కొరియాపై ఉన్న “పాత ద్వేషాన్ని” మరోసారి బయటపెట్టాయని ఆమె వ్యాఖ్యానించారు. “మన యుద్ధ నిరోధ శక్తిని శత్రువులకు నమ్మిస్తాం” అని ఆమె చెప్పారు. సోమవారం ప్రారంభమైన ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. ప్రధానంగా కంప్యూటర్ ఆధారిత కమాండ్ పోస్ట్ శిక్షణగా ఇవి జరుగుతాయి. దీనితో పాటు భూభాగంలో శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. సాధారణంగా ఇలాంటి విన్యాసాల సమయంలో ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలతో స్పందిస్తుంది.