Cuba : గుడ్ ఫ్రైడే కి జీవిత ఖైదీల విడుదల.. కుటుంబాల్లో ఆనందం

హవానా నగర శివార్లలోని లాలిమా జైలు గేట్ల వద్ద కుటుంబ సభ్యులు గుమికూడారు

Update: 2026-04-04 02:10 GMT

A pardoned prisoner hugs a family member outside La Lima penitentiary after his release in Guanabacoa, Havana, Cuba, Friday

హవానా నగర శివార్లలోని లాలిమా జైలు గేట్ల వద్ద కుటుంబ సభ్యులు గుమికూడారు. సంవత్సరాలుగా లోపల ఉన్న తమ వారిని బయటికి తీసుకువస్తారని ఆశతో ఎదురుచూశారు. వారిలో కాటియా ఆరియాస్ కూడా ఉన్నారు. 20 ఏళ్ల కుమారుడు ఎమిలియో అలెహాండ్రో లేవా జైలు తలుపుల నుంచి సంచులు, విడుదల పత్రాలతో బయటికి రావడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. దోపిడీ కేసులో అతను నిర్బంధంలో ఉన్నాడు. సంవత్సరాల తర్వాత కొడుకుని కౌగిలించుకున్నారు. “ఎంతో కష్టంగా గడిచింది. కానీ ఈరోజు దేవుడు నాకు అపార ఆనందం ఇచ్చాడు. తమ పిల్లలు విడుదల అవుతున్న ప్రతి తల్లి ఇలా సంతోషంగా ఉండాలి” అని ఆరియాస్ అన్నారు.

గుడ్ ఫ్రైడే సందర్భంగా...
పవిత్ర వారానికి ముందు “మానవతా దృక్పథంతో” 2,010 మంది ఖైదీలను విడుదల చేస్తామని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అయితే శుక్రవారం ఎంతమందిని వాస్తవంగా విడుదల చేశారు అన్న వివరాలు వెల్లడించలేదు. అమెరికా ప్రభుత్వం విధించిన చమురు ఆంక్షలు, రాజకీయ ఒత్తిడిల మధ్య క్యూబా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిరసనల్లో పాల్గొన్న వారిని విడుదల చేయాలన్న అమెరికా డిమాండ్లు కూడా ఉన్నాయి. లా లిమా జైలులో ఖైదీలను ఉదయం 6 గంటలకు లేపి పేర్లు పిలిచినట్లు విడుదలైన వారు తెలిపారు. గంటల తర్వాత కుటుంబ సభ్యుల కౌగిలిలోకి నడుచుకుంటూ వెళ్లారు.
రాజకీయ ఆరోపణలు లేని వారు...
విడుదలైన వారిలో ఎక్కువ మంది రాజకీయ ఆరోపణలపై శిక్ష అనుభవించలేదని ఏపీ ప్రతినిధులతో మాట్లాడిన ఖైదీలు చెప్పారు. అయితే నిరసనల్లో పాల్గొన్నవారిలో ఎంతమంది ఉన్నారన్నది స్పష్టంగా లేదు. వీరిపై సాధారణంగా ప్రజా శాంతి భంగం, ప్రభుత్వ అవమానం, తీవ్రవాదం వంటి కేసులు పెడతారని కార్యకర్తలు చెబుతున్నారు.2021లో దేశవ్యాప్తంగా జరిగిన భారీ నిరసనల తర్వాత వందల మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ సంఘటనల తర్వాత అప్పుడప్పుడు చిన్నచిన్న నిరసనలు జరుగుతున్నాయి. మార్చిలో మధ్య క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాన్ని నిరసనకారులు దహనం చేయడంతో ఐదుగురిని అరెస్టు చేశారు. విడుదల వివరాలపై స్పష్టత లేకపోవడంతో మానవ హక్కుల వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
చమురు సంక్షోభంతో...
“ఇది రాజకీయ ఖైదీల విడుదలగా ప్రభుత్వం చూపడం లేదు. మానవతా చర్యగా చెబుతోంది. దీంతో రాజకీయ నిర్బంధాన్ని అంగీకరించకుండా తప్పించుకుంటోంది” అని క్యూబా డెమోక్రాటిక్ ట్రాన్సిషన్ కౌన్సిల్ నాయకుడు మాన్యుయెల్ క్వెస్టా మోరువా అన్నారు.ఇప్పటికే విడుదలైన కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారని, స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి కల్పించారని ఆయన ఆరోపించారు.క్యూబాపై అమెరికా ఒత్తిడి కొనసాగుతోంది. చమురు ఆంక్షలతో దీవిలో విద్యుత్ కోతలు పెరిగాయి. ఆస్పత్రులు కూడా ఇబ్బందులు పడుతున్నాయి.ఈ వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నౌక ద్వారా 9–10 రోజుల ఇంధనం క్యూబాకు చేరేలా అనుమతించామని తెలిపారు. మరో ట్యాంకర్ కూడా రాబోతున్నట్లు సమాచారం.
గతంలో కూడా...
గతంలో కూడా ముఖ్య సందర్భాల్లో క్యూబా ప్రభుత్వం ఖైదీలను విడుదల చేసింది. జనవరి 2025లో వేటికన్‌తో చర్చల భాగంగా 553 మందిని విడుదల చేసింది. 2011 నుంచి ఇది ఐదోసారి విడుదల అని, ఇప్పటివరకు 11 వేల మందికి పైగా విడుదల చేశామని ప్రభుత్వం తెలిపింది. అయితే అనిశ్చితి మధ్య కూడా జైలు బయట ఆశాజనక దృశ్యాలు కనిపించాయి. కుటుంబ సభ్యులు కౌగిలించుకున్నారు. ఒక తండ్రి తన చిన్నారిని ముద్దుపెట్టుకున్నాడు. రెండేళ్ల శిక్షలో ఎక్కువ భాగం పూర్తి చేసిన 20 ఏళ్ల డామియన్ ఫరీనాస్ ముగ్గురు స్నేహితుల మధ్య వీధిలో కనిపించాడు.“ఇది స్వేచ్ఛ. ఎవరికీ ఋణపడి లేని క్షమాభిక్ష. ఇప్పుడు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాను” అని అతను ఆనందం వ్యక్తం చేశాడు.







Tags:    

Similar News