IPL 2026 : కోల్ కత్తాపై హైదరాబాద్ అద్భుత విజయం

కోల్ కత్తా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది.

Update: 2026-04-03 02:32 GMT

కోల్ కత్తా నైట్ రైడర్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఆరంభంలో ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ అదరగొట్టారు. వారి ఊపు చూస్తే స్కోరు 250 దాటుతుందేమోనని అనిపించింది. పవర్ ప్లేలో అద్భుతమైన ప్రదర్శన చూపిన ఈ జంట విడిపోయిన తర్వాత స్కోరు కొంత నెమ్మదించింది. ఐపీఎల్ పోరులో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల తేడాతో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించింది. అనుభవంతో ఆడినక్లాసెన్ 35 బంతుల్లో 52 పరుగుుల చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగులు చేసింది. బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్‌కు ఇది భారమైన లక్ష్యంగా మారింది.

రెండో ఓటమిని...
లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఎక్కడా ఊపు అందుకోలేదు. 16 ఓవర్లకే 161 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తొలి మ్యాచ్‌ను ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడిన తర్వాత ఇది కేకేఆర్‌కు వరుసగా రెండో ఓటమి. బ్యాటింగ్ బలం ఉన్న జట్టు అయినప్పటికీ కేకేఆర్ మధ్య ఓవర్లలో భాగస్వామ్యం కట్టలేకపోయింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక ఓవర్‌లో 25 పరుగులు ఇచ్చి ఒత్తిడికి లోనయ్యాడు. రెండు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి వికెట్ తీసుకోలేకపోయాడు. సునీల్ నరేన్ నాలుగు ఓవర్లు వేసి 39 పరుగులు ఇచ్చి వికెట్ దక్కించుకోలేదు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ 3 వికెట్లు తీశాడు. ఎహ్సాన్ మలింగా 2, నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీయడంతో కోల్ కత్తా పని అయిపోయింది.
బ్యాటర్లు తడబడి...
కేకేఆర్ కెప్టెన్ అంజిక్యా రహేనా 10 బంతుల్లో 8 పరుగులతో నిరాశపరిచాడు. యువ ఆటగాడు రఘువంశీ 29 బంతుల్లో 52 పరుగులతో పోరాడినా మరో వైపు మద్దతు లభించలేదు. ఫిన్ అలెన్ 7 బంతుల్లో 28 పరుగులతో ఆరంభంలో దూకుడు చూపాడు. అయితే హర్ష్ దుబే క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. స్టార్ ఆటగాడు కామెరాన్ గ్రీన్ రన్ అవుట్‌గా రెండు పరుగులకే వెనుదిరిగాడు. రఘువంశితో జరిగిన గందరగోళంలో ఈ వికెట్ పడింది. రఘువంశి కూడా మరో రన్ అవుట్‌లో పెవిలియన్ చేరడంతో కేకేఆర్ పరిస్థితి మరింత దెబ్బతింది. రింకూ సింగ్ 35 పరుగులతో కొంత ప్రతిఘటన చూపినా ఆశలు నిలవలేదు.
ఇద్దరు అర్ధసెంచరీ మిస్...
ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 21 బంతుల్లో 46, అభిషేక్ శర్మ 21 బంతుల్లో 48 పరుగులు చేసి శుభారంభం అందించారు. 34 బంతుల్లోనే 82 పరుగులు జోడించారు. ఆ తర్వాత వికెట్లు త్వరగా పడ్డాయి. ఇద్దరూ అర్థసెంచరీ మిస్ అయ్యారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ 14 పరుగులకే అవుటయ్యాడు. 9వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన బ్లెస్సింగ్ ముజరబాని రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఎస్‌ఆర్‌హెచ్ మూడు వికెట్లు ఏడు పరుగులకే కోల్పోయింది. ఆ సమయంలో క్లాసెన్ జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను కట్టాడు. నితీశ్ కుమార్ రెడ్డి 24 బంతుల్లో 39తో కలిసి 53 బంతుల్లో 82 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ జోడీ 36 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసింది. చివర్లో Vaibhav Arora రెండు వికెట్లు తీసి పరుగుల వేగాన్ని తగ్గించాడు. చివరి ఓవర్‌లో ముజరబానీ క్లాసెన్‌ను, శివాంగ్ కుమార్‌ను ఔట్ చేసి నాలుగు వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అయినా ఎస్‌ఆర్‌హెచ్ పెద్ద స్కోరు కట్టడంలో క్లాసెన్ ఇన్నింగ్స్ కీలకమైంది.




Tags:    

Similar News