Israel - Iran War : ఇరాన్‌పై దాడులు… బెరూట్, ఖతార్, సౌదీ, యుఏఈలో ఉద్రిక్తత

ఇజ్రాయిల్, అమెరికా కలిసి మంగళవారం తెల్లవారుజామున టెహ్రాన్ పై మరో దఫా దాడులు జరిపాయి

Update: 2026-04-01 02:06 GMT

ఇజ్రాయిల్, అమెరికా కలిసి మంగళవారం తెల్లవారుజామున టెహ్రాన్ పై మరో దఫా దాడులు జరిపాయి. యుద్ధం ఆరంభంతో పోలిస్తే ఇరాన్ తక్కువ క్షిపణులు ప్రయోగిస్తున్నా, తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తోంది. ప్రాంతంలో 3 వేల మందికి పైగా మరణించగా, లెబనాన్, ఇరాన్‌లలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోకి ఇరానీయుల ప్రవేశం, ట్రాన్సిట్‌ను ఎమిరేట్స్, ఎతిహాద్, ఫ్లై దుబాయ్ విమానయాన సంస్థలు నిలిపివేశాయి. అయితే 10 ఏళ్ల గోల్డెన్ వీసా ఉన్నవారికి అనుమతి ఉంటుందని తెలిపాయి. అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

ఖతార్ తీరంలో ట్యాంకర్‌పై దాడి...
ఖతార్ తీరంలో ఒక చమురు ట్యాంకర్‌పై దాడి జరిగింది. నౌక పక్కభాగాన్ని ప్రాజెక్టైల్ తాకినట్లు బ్రిటన్ సముద్ర వాణిజ్య పర్యవేక్షణ కేంద్రం తెలిపింది. సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. పర్యావరణ నష్టం లేదని వెల్లడించింది. సౌదీ అరేబియా రెండు డ్రోన్లను కూల్చినట్లు ప్రకటించింది. గత వారం అక్కడి ఎయిర్‌బేస్‌పై క్షిపణి, డ్రోన్ దాడుల్లో అమెరికా సైనికులు గాయపడ్డారు.బెరూట్ పరిసరాల్లో రెండు వేర్వేరు దాడుల్లో హిజ్బుల్లాకు చెందిన సీనియర్ కమాండర్ సహా ఇద్దరిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఖాల్దే ప్రాంతంలో వాహనంపై దాడి జరగడంతో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ తెలిపింది.
జాతినుద్దేశించి నేడు ట్రంప్ ప్రసంగం
వైట్ హౌస్ ప్రకారం ట్రంప్ బుధవారం రాత్రి 9 గంటలకు ఇరాన్ యుద్ధంపై దేశానికి సందేశం ఇవ్వనున్నారు. “రెండు మూడు వారాల్లో పని పూర్తవుతుంది. వాళ్ల వద్ద ఉన్నదంతా నిర్వీర్యం చేస్తాం” అని ట్రంప్ చెప్పారు. “అణ్వాయుధాలు లేకుండా చేయడమే నా లక్ష్యం. అది సాధించాం” అని అన్నారు.ఇరాన్‌తో చర్చలు జరిగే అవకాశమున్నదని, లేకపోతే కీలక వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు.అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం ఇప్పటివరకు 348 మంది సైనికులు గాయపడ్డారు. అందులో ఆరుగురికి తీవ్ర గాయాలు. 315 మంది తిరిగి విధుల్లో చేరారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి 13 మంది సైనికులు మరణించారు.
టెక్ సంస్థలకు ఇరాన్ హెచ్చరిక
ఇరాన్ విప్లవ గార్డులు ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా 18 అమెరికా టెక్ సంస్థలను లక్ష్యాలుగా ప్రకటించాయి. మధ్యప్రాచ్యంలోని వారి కార్యాలయాలు దాడులకు గురవుతాయని హెచ్చరించాయి. యుద్ధం ముగియొచ్చనే ఆశలతో వాల్ స్ట్రీట్ మార్కెట్లు ఊపందుకున్నాయి. డౌ జోన్స్ 1,100 పాయింట్లకు పైగా ఎగసింది. ఎస్ & పి 500, నాస్‌డాక్ సూచీలు కూడా గణనీయంగా పెరిగాయి. చమురు ధరలు కొద్దిగా తగ్గడం దీనికి తోడైంది.సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా, “ఎవరైనా నేరుగా దాడి చేయకపోతే ఈ యుద్ధంలో పాల్గొనము” అని లండన్‌లో జరిగిన కార్యక్రమంలో చెప్పారు.


Tags:    

Similar News