Israel - Iran War : హోర్ముజ్ జలసంధిపై టెన్షన్... 41 దేశాల సమావేశం
హోర్ముజ్ జలసంధిని మళ్లీ తెరవాలని నలభైకిపైగా దేశాల ప్రతినిధులు గురువారం వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని మళ్లీ తెరవాలని నలభైకిపైగా దేశాల ప్రతినిధులు గురువారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత ఈ మార్గం మూసుకుపోవడంతో ఇరాన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బందీగా పెట్టిందని బ్రిటన్ ఆరోపించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈ జలమార్గ భద్రత అమెరికా బాధ్యత కాదని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. యుద్ధానికి మద్దతు ఇవ్వడంలో విఫలమయ్యారని యూరప్ మిత్రదేశాలపై విమర్శలు చేశారు. అమెరికా నాటో నుంచి తప్పుకునే అవకాశాన్ని కూడా మళ్లీ ప్రస్తావించారు.
ఇంధన కొరతతో...
బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి యివెట్ కూపర్ మాట్లాడుతూ, ఈ చర్చలు సైనిక మార్గాలకన్నా రాజకీయ, దౌత్య చర్యలపై దృష్టి పెట్టాయని చెప్పారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న అంతర్జాతీయ సంకల్పానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సమావేశానికి అంటార్కిటికా తప్ప అన్ని ఖండాల నుంచి దేశాలు పాల్గొన్నాయి. యుద్ధం వల్ల మధ్యప్రాచ్యాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఎరువుల కొరత, ఆహార ధరల పెరుగుదల కనిపిస్తోందని చెప్పారు. “ఇరాన్ ఒక అంతర్జాతీయ నౌకాయాన మార్గాన్ని తన ఆధీనంలో పెట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బందీ చేసింది” అని కూపర్ అన్నారు. చమురు, ఆహార ధరల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలు, వ్యాపారాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు.
నిలిచిన నౌకాయానం ...
పర్షియన్ గల్ఫ్‌ను ప్రపంచ సముద్రాలతో కలిపే ఈ మార్గంలో ఇరాన్ వాణిజ్య నౌకలపై దాడులు చేసింది. మరిన్ని దాడుల భయం నెలకొంది. దీంతో రవాణా దాదాపు ఆగిపోయింది. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన మార్గం మూసుకుపోవడంతో పెట్రోలియం ధరలు ఎగసిపోయాయి.యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైన తర్వాత గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై 23 ప్రత్యక్ష దాడులు జరిగాయి. 11 మంది సిబ్బంది మరణించారు అని నౌకాయాన డేటా సంస్థలాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ తెలిపింది.ప్రస్తుతం ఈ మార్గంలో వెళ్లే నౌకలు చాలా తగ్గిపోయాయి. వాటిలో ఎక్కువగా ఆంక్షలను తప్పించుకుని ఇరాన్ చమురును మోసుకెళ్తున్న ట్యాంకర్లు ఉన్నాయని ఆ సంస్థ వివరించింది. ఎవరు వెళ్లాలి, ఎవరు వెళ్లకూడదు అన్న విషయాన్ని ఇరాన్ తనిఖీ చేస్తోందని తెలిపింది. బుధవారం రాత్రి ప్రసంగంలో ట్రంప్ మాట్లాడుతూ, హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాపై ఆధారపడే దేశాలే దీన్ని కాపాడుకోవాలని, అమెరికా కాదు అని స్పష్టం చేశారు.
బలవంతంగా తెరిచేందుకు...
యుద్ధం కొనసాగుతున్న సమయంలో, ఇరాన్ వద్ద నౌకలపై ప్రయోగించే క్షిపణులు, డ్రోన్లు, మైన్లు ఉండటంతో బలవంతంగా ఈ మార్గాన్ని తెరవడానికి ఏ దేశం ముందుకు రావడం లేదు.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ, బలప్రయోగంతో జలసంధిని తెరవడం వాస్తవానికి సాధ్యం కాదని అన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో మాక్రోన్ మీడియాతో మాట్లాడుతూ, యుద్ధ విరమణ తర్వాత ఇరాన్‌తో చర్చల ద్వారానే ఈ మార్గాన్ని తెరవగలమని చెప్పారు. యుద్ధం తీవ్రత తగ్గిన తర్వాత చమురు, వాయు ట్యాంకర్లకు భద్రత కల్పించేందుకు యూరప్ దేశాలు, ఇతర దేశాలతో కలిసి అంతర్జాతీయ మిషన్ ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్ ప్రతిపాదిస్తోంది. యుద్ధం ముగిసిన తర్వాత భద్రత ఎలా కల్పించాలన్న దానిపై కొన్ని దేశాల సైనిక ప్రణాళికాధికారులు వచ్చే వారం సమావేశం కానున్నారని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. మైన్ల తొలగింపు, వాణిజ్య నౌకలకు భరోసా కల్పించడం వంటి అంశాలు చర్చకు వస్తాయి.
ఇరాన్ ఒంటరి చేయడమే...
ఇరాన్‌ను ఒంటరిగా చేయడం, నౌకాయానాన్ని అడ్డుకునే దాని ఉద్దేశాన్ని బలహీనపరచడం ఈ సమావేశ లక్ష్యమని కూపర్ చెప్పారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్, యుఏఈ తదితర దేశాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇరాన్ “అవివేకపు” దాడులపై దౌత్య ఒత్తిడి పెంచడం, ఆర్థిక చర్యలను కఠినతరం చేయడం గురించి చర్చించారు. ఈ ఘర్షణలో చిక్కుకుపోయిన 2,000 నౌకలు, 20,000 సముద్ర కార్మికులను బయటపడేసేందుకు ఐక్యరాజ్యసమితి నౌకాయాన సంస్థతో కలిసి పని చేయాలన్న అంశం కూడా చర్చకు వచ్చింది. అయితే స్పష్టమైన చర్యలు ప్రకటించలేదు.
ట్రంప్‌కు సందేశం పంపాలన్నదే...
భవిష్యత్తులో యుద్ధ విరమణ తర్వాత ఉక్రెయిన్ భద్రతకు బ్రిటన్, ఫ్రాన్స్ నాయకత్వంలో ఏర్పాటైన అంతర్జాతీయ కూటమి మాదిరిగానే ఈ ప్రయత్నం ఉందని విశ్లేషకులు అంటున్నారు. యూరప్ దేశాలు తమ భద్రత కోసం ఎక్కువగా ముందుకొస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వానికి చూపాలన్న ఉద్దేశం కూడా ఉందని భావిస్తున్నారు. నాటో తమతో చెడు వ్యవహరించిందని ట్రంప్ మళ్లీ విమర్శించారు. అమెరికా నాటో నుంచి తప్పుకునే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ లండన్ లో మధ్యప్రాచ్య భద్రత అధ్యయనాల నిపుణుడు డేవిడ్ బి. రాబర్ట్స్ మాట్లాడుతూ, హోర్ముజ్ విషయంలో అంతర్జాతీయ కూటమి ప్రయత్నాలు నాటోపై ట్రంప్ వైఖరితో ముడిపడి ఉన్నాయని చెప్పారు. “అమెరికా చమురు ఎగుమతి దేశం. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరా అంతరాయం ప్రభావం యూరప్, ఆసియాపై ఎక్కువగా పడుతుంది. అమెరికాపై అంతగా ఉండదు” అని ఆయన వ్యాఖ్యానించారు.