అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంలో ఇరాన్‌పై యుద్ధ పురోగతిపై వివరించారు. ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలు, నౌకాదళాన్ని నిర్వీర్యం చేయడం, ప్రాంతంలో అస్థిరత సృష్టిస్తున్న అనుబంధ గుంపులను అణచడం, అణ్వాయుధాలు పొందకుండా చూడడం తమ లక్ష్యాలని చెప్పారు. ప్రసంగానికి ముందే ఇరాన్ అధ్యక్షుడు కాల్పుల విరమణ కోరినట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీనిపై ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఈ వ్యాఖ్యలు తప్పుడు, ఆధారరహితమని చెప్పారు.అమెరికా యుద్ధనౌక యూఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ బుష్ తో పాటు మూడు డిస్ట్రాయర్లు మధ్యప్రాచ్యానికి వెళ్లనున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ బృందంలో ఆరు వేల మందికి పైగా నావికులు ఉన్నారు. అలాగే 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ కు **82nd కు చెందిన వేలాది సైనికులు ఇప్పటికే అక్కడికి చేరుతున్నట్లు తెలిపారు.
చమురు ధరలు పెరిగి...
ఇరాన్ యుద్ధ ప్రభావంతో అమెరికాలో పెట్రోలు ధరలు గ్యాలన్‌కు 4 డాలర్లకు పైగా చేరాయి. 2022 తర్వాత ఇదే మొదటిసారి. రవాణా, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడంతో కిరాణా వస్తువుల ధరలపై కూడా ప్రభావం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.ట్రంప్ మాట్లాడుతూ అమెరికాకు తగినంత ఇంధన నిల్వలున్నాయని, దేశీయ తవ్వకాల వల్ల సౌదీ అరేబియా, రష్యా కలిపినదానికంటే ఎక్కువ చమురు, వాయువు ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. అమెరికా రోజుకు 1.3 కోట్ల బారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోందని వివరించారు.ప్రసంగంలో మధ్యప్రాచ్యానికి పంపిన అదనపు భూసేనల గురించి ప్రస్తావించలేదు. నాటో దేశాలు హార్ముజ్ జలసంధి భద్రతలో భాగస్వామ్యం కావడంలో వెనుకడుగువేస్తున్నాయని విమర్శించారు. అవసరమైతే అమెరికా నాటో నుంచి బయటకు రావడాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా చెప్పారు. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అయితే అమెరికాకు ఆ జలసంధి అవసరం లేదని, అవసరమున్న దేశాలు దాన్ని రక్షించుకోవాలని వ్యాఖ్యానించారు.
ఇరాన్ అణు కేంద్రాలపై...
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా ఉపగ్రహ నిఘా కొనసాగుతోందని చెప్పారు. క్షిపణి, డ్రోన్ దాడులు తగ్గినప్పటికీ, అవసరమైతే మళ్లీ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత యుద్ధాలతో పోల్చితే ఇరాన్ యుద్ధం కేవలం 32 రోజులు మాత్రమే కొనసాగుతోందని, ఇప్పటికే ఇరాన్ సైనిక శక్తి తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు. అయితే స్వతంత్ర గణాంకాల ప్రకారం ఇరాన్ దాడులు పూర్తిగా ఆగలేదని నిపుణులు చెబుతున్నారు.మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుదిర్చిన అణు ఒప్పందాన్ని ట్రంప్ మరోసారి విమర్శించారు. ఇరాన్ అణు కార్యక్రమం శాంతియుతమని చెప్పినా, యురేనియంను 60 శాతం శుద్ధి స్థాయికి చేర్చిందని వివరించారు. “మేము చమురు కోసం అక్కడ లేము. మిత్ర దేశాలకు సహాయం చేసేందుకే ఉన్నాం” అని ట్రంప్ అన్నారు. ప్రసంగానికి ముందుగా వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో అమెరికా ప్రజలు యుద్ధం త్వరగా ముగించాలని కోరుకుంటున్నారని ట్రంప్ చెప్పారు.
క్షిపణి ముప్పు ఉందని..
ఇదే సమయంలో ఇరాన్ నుంచి క్షిపణి ముప్పు ఉందని యూఏఈ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. దుబాయ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.ఇజ్రాయెల్‌లో గురువారం ఉదయం ఇరాన్ క్షిపణి దాడుల్లో ముగ్గురు పిల్లలు స్వల్పంగా గాయపడ్డారు. టెల్ అవీవ్ పరిసర ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగాయి. నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే వచ్చే వారం వాషింగ్టన్‌కు రానున్నారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అమెరికా ప్రజలకు లేఖ రాస్తూ, ఈ యుద్ధం నిజంగా అమెరికా ప్రయోజనాల్లోదేనా అని ప్రశ్నించారు. మధ్యప్రాచ్య పరిస్థితుల కారణంగా హార్ముజ్ జలసంధి మార్గంలో మానవతా సహాయ సరుకులు నిలిచిపోయాయని అంతర్జాతీయ సహాయ సంస్థలు హెచ్చరించాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ సహాయక చర్యల రవాణా సులభతరం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.