Hyderabad : వివాహిత బలవన్మరణం.. కుమారుడికి విషమిచ్చి... తాను కూడా?
హైదరాబాద్ లో యువతి బలవన్మరణానికి పాల్పడింది
హైదరాబాద్ లో యువతి బలవన్మరణానికి పాల్పడింది. తన కుమారుడికి విషమిచ్చితాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ లో మీర్ పేట్ లో ఈ ఘటన జరిగింది. భార్యను ఇంట్లో బందీ చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కూతురు..మనవడు చనిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన తల్లి కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ఇంతటి విషాదానికి కారణం మృతురాలి భర్తే అని.. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని.. భర్తనే వారికి విషమిచ్చి చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్లు డ్రామాలు ఆడుతున్నాడని.. వాడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మూడేళ్ల క్రితం వివాహమై...
పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా రామన్నపేట ప్రాంతానికి చెందిన ఛార్టర్డ్ ఎకౌంటెంట్ యశ్వంత్ రెడ్డికి అదే ప్రాంతానికి చెందిన సుస్మిత తో మూడేళ్ల క్రితం వివాహమైంది. దంపతులు హస్తినాపురం జయకృష్ణ ఎన్ క్లేవ్ లో నివసిస్తున్నారు. వీరికి పదకొండు నెలల యశ్వంత్ నందన్ రెడ్డి అనే కుమారుడున్నాడు. కొడుకు మొదటి పుట్టినరోజు రానుండడంతో రెండు రోజుల క్రితం షాపింగ్ చేశారు. గురువారం ఉదయం భర్త ఆఫీసుకు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య పడకగదిలో చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించగా.. కుమారుడు కూడా అప్పటికే మృతిచెందినట్లుగా కనిపించాడు.. వారితో పాటే ఇంట్లో ఉన్న సుస్మిత తల్లి లలిత కూడా అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించింది..
ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదని...
దీంతో వెంటనే అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి తరలించారు. సుస్మిత మొదట తన బాబుకు విషమిచ్చి.. తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.సుస్మిత ఆత్మహత్యకు ముమ్మాటికీ యశ్వంత్ రెడ్డి వేధింపులే కారణమని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మృతురాలి బంధువులు పేర్కొన్నారు. పెళ్ళైన రోజు నుంచి తమ బిడ్డను అనుమానంతో వేధిస్తున్నాడని, తమతో కనీసం మాట్లాడించేవాడు కాదని, కలిసేందుకు కూడా అంగీకరించేవాడు కాదని బంధువులు చెబుతున్నారు. ఇది ముమ్మాటికి హత్యే అని మృతురాలి బంధువులు ఆరోపించారు. యశ్వంత్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని.. అతని వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినందున.. హత్య కేసు నమోదు చేయాలని సుస్మిత బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.