బంగారం ఇక మధ్యతరగతి ఇళ్లలో మాయం కానుంది. వెండి కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. బంగారం, వెండి ధరలు భారీగా పెరగనున్నాయి. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధంతో ధరలు మరింతగా పెరగనున్నాయి. అయితే ఎప్పటి వరకూ ఈ ధరలు పెరుగుదల ఉంటాయన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను వణికిస్తోంది. యుద్ధం వచ్చిందంటే చాలు.. ఎక్కడ తమ డబ్బు మునిగిపోతుందో అని భయపడే మదుపుదారులంతా షేర్ మార్కెట్ల నుంచి వెనక్కి తగ్గి, తమ పెట్టుబడులను బంగారం, వెండి మీద పెట్టడానికి పోటీ పడుతుంటారు. అందుకే ఇప్పుడు పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటికే యుద్ధ సెగతో బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగిపోగా, రానున్న రోజుల్లో ఇవి మరింత ప్రియం కానున్నాయని మార్కెట్ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.
పెళ్లిళ్ల సీజన్ తో పాటు...
బంగారం, వెండి ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లేలా కనిపిస్తోంది. ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండంతో, ఈ ధరల పెరుగుదల సామాన్య కుటుంబాల బడ్జెట్ ను పూర్తిగా తలకిందులు చేయనుంది. యుద్ధం ఎంత ముదిరితే పసిడి పరుగు అంత వేగంగా ఉంటుందని, వెండి కూడా అదే బాటలో నడుస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు $5,300 మార్కుకు చేరువలో ఉంది. మన దేశంలో 10 గ్రాముల బంగారం ధర ఇప్పటికే రూ.1,62,000 దాటేసింది. ఒకవేళ యుద్ధం గనుక మరింత ముదిరితే, ఇది త్వరలోనే రూ.1.70 లక్షల వరకు వెళ్లవచ్చు. వెండి పరిస్థితి కూడా అలాగే ఉంది.. కిలో వెండి ధర .3.20 లక్షలను దాటేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రూపాయి విలువ పతనం...
ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగితే, మన రూపాయి విలువ పడిపోతుంది. మనం బంగారాన్ని వేరే దేశాల నుంచి కొనుగోలు చేస్తాం కావున , రూపాయి విలువ తగ్గితే మనం బంగారం కోసం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల మన దేశంలో బంగారం రేట్లు మరింత పెరుగుతాయి. ఈరోజు కూడా బంగారం ధరలు దేశంలో పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వేలు పెరిగింది. కిలో వెండి ధరపై ఇరవై ఐదు వేలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,58,660 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,73,090 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 3,25,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు మళ్లీ పెరగవచ్చు.