Hyderabad : యుద్ధం ఎఫెక్ట్.. పెట్రోలు బంకుల వద్ద పెరిగిన రద్దీ

హైదరాబాద్ లో పెట్రోలు బంకుల వద్ద రద్దీ పెరిగింది

Update: 2026-03-04 12:28 GMT

హైదరాబాద్ లో పెట్రోలు బంకుల వద్ద రద్దీ పెరిగింది. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మరిన్ని రోజులు కొనసాగుతుందని తెలియడంతో పెట్రోలు కొరత భారత్ లో ఏర్పడుతుందన్న ప్రచారంతో హైదరాబాద్ లోనూ తమ వాహనాలకు పెట్రోలు కొట్టించుకునేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. భారత్ లో నెలన్నర రోజులకు సరిపడా చమురు నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. దీంతో కొన్ని పెట్రోలు బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టారు. మరో నెల రోజుల పాటు యుద్ధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన కూడా ఈ రద్దీ పెరగడానికి కారణమయింది

నిల్వలున్నాయని చెబుతున్నా...
చమురు నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని హామీ ఇస్తున్నప్పటికీ పెట్రోలు లేకపోతే బండి నడిచే అవకాశం ఉండకపోవడంతో హైదరాబాదీలు పెట్రోలు బంకుల వద్ద బారులు తీరారు.అవసరం ఉన్నా లేకపోయినా పెట్రోల్ ను ద్విచక్ర, ఫోర్ వీలర్స్ లో నింపేసుకుంటున్నారు. దీంతో తమంతట తామే కృత్రిమ కొరతను హైదరాబాదీలు సృష్టించుకుంటున్నట్లుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పెట్రోలు నిల్వలు తగ్గిపోతే ధరలు పెరుగుతాయన్న ఆందోళన మరింత పెరిగి వాహనదారులు వరస బెట్టి పెట్రోలు బంకులకు వస్తున్నారు. చమురు నిల్వలున్నాయని, ఎల్పీజీ కి మాత్రం ప్రత్యామ్నాయం వెదుకుతున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
సోషల్ మీడియా ప్రచారంతో...
సోషల్ మీడియాతో పాటు ఇతర మీడియాల్లో వస్తున్న ప్రచారం కూడా ఈ రద్దీ పెరగడానికి కారణమయిందని పెట్రోలు బంకు యజమానులు చెబుతున్నారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో ఎక్కువ సేపు పెట్రోలు బంకుల వద్ద నిల్చుని తమ వాహనాల్లో ఇంధనాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పెట్రోలు కొరత అనేది ఉండదని, ప్రభుత్వం పదే పదే చెబుతున్న మాటలను కూడా పెడ చెవిన పెట్టిన వాహనదారులు తాము మాత్రం పెట్రోలుతో వాహనాలను నింపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో ఏ పెట్రోలు బంకులో చూసినా వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికైనా సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మకుండా కృత్రిమ కొరత దిశగా ప్రయత్నాలు చేయవద్దని పలువురు కోరుతున్నారు.


Tags:    

Similar News