Road Accident : హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మరణించారు
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మరణించారు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో కొన్ని కుటుంబాల్లో పండగ ముందు విషాదం నింపింది. మృతి చెందిన వారంతా విద్యార్థులే. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం...హైదరాబాద్ ఇక్ఫాయి యూనివర్సిటీ విద్యార్థులు ప్రమాదానికి గురయినట్లు చెబుతున్నారు.
బర్త్ డే వేడుకలకు వెళ్లి...
ఇక్ఫాయి యూనివర్సిటీ విద్యార్థులు నిఖిల్, సూర్యతేజ, సుమిత్, రోహిత్, నక్షత్రలు కోకాపేటకు కారులో వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కోకాపేటలో జరిగిన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన ఈ మిత్రులు ఒక స్నేహితుడిని డ్రాప్ చసి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి గల కారణమని పోలీసులు చెబుతున్నారు. మీర్జాగూడ వద్దకు రాగానే వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. వెంటనే అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.
అతి వేగమే...
ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడిక్కడే మరణించారు. అయితే ఇందులో నక్షత్ర అనే యువతికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నక్షత్రను ఆసుపత్రికి తరలించారు. నక్షత్ర పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. అందరూ విద్యార్థులే. అతి వేగంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.