Hyderabad : హైదరాబాద్ - విజయవాడ హైవే పై ఎన్ని వాహనాలున్నాయో తెలుసా?

సంక్రాంతి పండగకు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే వారితో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి ఈరోజు కూడా రద్దీగా మారింది.

Update: 2026-01-11 03:06 GMT

సంక్రాంతి పండగకు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే వారితో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి ఈరోజు కూడా రద్దీగా మారింది. సంక్రాంతికి వెళ్లే వాహనాలతో రద్దీ ఎక్కువయింది. కొన్ని చోట్ల బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఏర్పడుతుంది. వాహనాలు అతి నెమ్మదిగా సాగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి మొదలయిన రద్దీతో జాతీయ రహదారిపై వాహనాలు చాలా నెమ్మదిగా అనేక చోట్ల సాగుతున్నాయి. ప్రధానంగా టోల్ ప్లాజాల వద్ద కొంత సమయం ఆగాల్సి రావడంతో అక్కడ ట్రాఫిక్ లో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి.

టోల్ ప్లాజాల వద్ద..

పంతంగి టోల్ ప్లాజా నుంచి కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉందని నిర్వాహకులు తెలిపారు. పోలీసులు అక్కడ విధులను నిర్వహిస్తూ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నప్పటికీ వాహనాలు మాత్రం వేగంగా వెళ్లాలని ముందుకు రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ ను వేగంగా పంపేందుకు విజయవాడ వైపు వెళ్లే టోల్ బూత్ లను ఎక్కువ సంఖ్యలో తెరిచారు. హైదరాబాద్ కు వచ్చే టోల్ బూత్ లను తగ్గించి అటు వైపు వెళ్లే బూత్ ల సంఖ్య పెంచారు.
నిన్న ఒక్కరోజే...
నిన్న దాదాపు విజయవాడ వైపు 70 వేల కుపైగా వాహనాలు వెళ్లాయని టోల్ నిర్వాహకులు చెబుతున్నారు. నేడు ఆదివారం కావడంతో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరొకవైపు ఆర్టీసీ, ప్రయివేటు బస్సులు, రైళ్లు సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులతో రద్దీగా మారిపోవడం, టిక్కెట్లు దొరకకపోవడంతో ఎక్కువ మంది సొంత వాహనాలతో బయలుదేరారు. ఈసారి ఆదివారం నుంచి ఆదివారం వరకూ సంక్రాంతి సెలవులు రావడంతో ఎక్కువ మంది సొంతూళ్లకు బయలుదేరి వెళుతున్నారు.



















Tags:    

Similar News