ఫ్యాక్ట్ చెక్: రోడ్డు కూలిపోయి సింక్ హోల్ ఏర్పడడాన్ని చూపిస్తున్న వీడియో ఢిల్లీ కి సంబంధించింది కాదు
భారతదేశ రాజధాని నగరం ఢిల్లీలో సెప్టెంబర్ 30, 2035న భారీ వర్షాలు కురిశాయి. దీని వలన నగరంలోని పలు ప్రాంతాలలో, NCR ప్రాంతం
భారతదేశ రాజధాని నగరం ఢిల్లీలో సెప్టెంబర్ 30, 2035న భారీ వర్షాలు కురిశాయి. దీని వలన నగరంలోని పలు ప్రాంతాలలో, NCR ప్రాంతం, ముఖ్యంగా ప్రధాన రహదారులు, అండర్‌పాస్‌లలో భారీగా నీరు చేరింది. పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయాలు కూడా ఏర్పడ్డాయి. ఢిల్లీ విమానాశ్రయానికి, అక్కడి నుండి వేరే ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు కూడా విమానయాన సంస్థలు పలు సూచనలు జారీ చేశాయి.
ఢిల్లీలో ఒక రోడ్డు కూలిపోయిందని, బహుశా మెట్రో నిర్మాణం, ఇటీవలి భారీ వర్షాలకు సంబంధించినదని అనేక మంది వినియోగదారులు పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను వైరల్ చేస్తున్నారు. కొన్ని పోస్ట్‌లలో “ఢిల్లీలో రోడ్డు మీద సింక్ హోల్ ఏర్పడింది” అని పేర్కొన్నారు. రాజధానిలో భూగర్భ పనుల వల్లే ఈ గుంత సంభవించిందని పలువురు తెలిపారు. ఢిల్లీ మౌలిక సదుపాయాల వైఫల్యమే దీనికి కారణమని పేర్కొంటూ ప్లాట్‌ఫారమ్‌లలోని అనేక పోస్ట్‌లు ఈ ఫుటేజీని పంచుకున్నాయి.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో భారత దేశ రాజధాని ఢిల్లీకి చెందినది కాదు. ఇది 2025 సెప్టెంబర్ 24న బ్యాంకాక్‌లోని సామ్సేన్ రోడ్‌లోని వజీరా హాస్పిటల్ ముందు ఏర్పడిన సింక్‌హోల్‌ను చూపిస్తుంది. వైరల్ వీడియో నుండి సేకరించిన కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ సంఘటన బ్యాంకాక్‌లో జరిగిందని, ఢిల్లీలో కాదని పేర్కొంటూ అనేక సోషల్ మీడియా పోస్ట్‌లను కనుగొన్నాము.
“Thailand: Bangkok: Road Collapses HUGE crater in Road” అనే క్యాప్షన్ తో యూట్యూబ్ రీల్ సెప్టెంబర్ 25, 2025న పోస్టు చేశారు.
మణిపూర్ ఫైల్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వివరాలను పోస్టు చేశారు. సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం వజీరా హాస్పిటల్ ముందు ఉన్న సామ్సెన్ రోడ్‌లో దాదాపు 50 మీటర్ల లోతు, 30 మీటర్ల వెడల్పుతో భారీ సింక్‌హోల్ కనిపించిందని తెలిపారు. అంతేకాకుండా ప్రమాదం ఉందని గమనించి ప్రజలను ఆ ప్రాంతం నుండి తరలించడమే కాకుండా, ట్రాఫిక్ ను మూసివేస్తున్నట్లు పేర్కొంటూ ఒక పోస్ట్‌ను కూడా షేర్ చేశారు.
ఈ సంఘటన వజీరా, సంఘి కూడళ్ల మధ్య ఉదయం 7:13 గంటలకు చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ, ఎవరికీ గాయాలు కాలేదని నివేదించారు. అయితే ఈ ఘటన వలన ఆ ప్రాంతంలో ప్రజా రవాణాకు ఊహించని అంతరాయం ఏర్పడింది. వజీరా హాస్పిటల్‌లో అవుట్ పేషెంట్ సేవలు నిలిపివేశారు, సమీపంలోని భవనాల నుండి దాదాపు 3,500 మంది ఇన్‌పేషెంట్లను సురక్షితంగా తరలించారు. ఆసుపత్రి నిర్మాణాలు దెబ్బతినలేదని అధికారులు నిర్ధారించారు. అపార్ట్‌మెంట్ భవనాల్లోని నివాసితులను కూడా ముందుజాగ్రత్తగా ఖాళీ చేయాలని ఆదేశించారు. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు రెండు విద్యుత్ స్తంభాలు, ఒక పోలీసు వాహనం రంధ్రంలో పడిపోయాయి.
బ్యాంకాక్ మెట్రోపాలిటన్ అడ్మినిస్ట్రేషన్ (BMA) ఈ సంఘటనను టావో పూన్, రాట్ బురానా మధ్య మాస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ (MRT) పర్పుల్ లైన్ పొడిగింపు నిర్మాణం కారణంగా చోటు చేసుకుందని వివరించింది. అధికారులతో కలిసి ఆ స్థలాన్ని పరిశీలించిన బ్యాంకాక్ గవర్నర్ చాడ్‌చార్ట్ సిట్టిపుంట్, వజీరా హాస్పిటల్ రైల్వే స్టేషన్ దగ్గర ఏర్పడిన సింక్‌హోల్ వల్ల సొరంగంలోకి మట్టి ప్రవహించిందని వివరించారు. దీని వల్ల చుట్టుపక్కల నిర్మాణాలు కూలిపోయాయి, ఒక ప్రధాన నీటి పైపు పగిలిపోయింది.
ఇదే సంఘటనకు సంబంధించిన మరో వీడియోను BBC షేర్ చేసింది. ఆసుపత్రి, పోలీస్ స్టేషన్ ముందు రద్దీగా ఉండే బ్యాంకాక్ రహదారిపై ఒక పెద్ద సింక్ హోల్ తెరుచుకుందని, దీనివల్ల ప్రజలు తరలివెళ్లారని పేర్కొంది. దాదాపు 50 మీటర్లు (160 అడుగులు) ఉన్న ఈ రంధ్రం కారణంగా విద్యుత్ లైన్లు తెగిపోయి, నీటి సరఫరా పైపు నుండి నీరు ప్రవహించడం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇటీవలి భారీ వర్షం, లీకైన పైపు కారణంగా కూడా ఇది జరిగి ఉండవచ్చని అధికారులు వార్తా సంస్థ AFPకి తెలిపారు. ఈ ఘటన కారణంగా ఎవరికీ ఎటువంటి గాయాలు లేదా మరణాలు జరగలేదని థాయ్ అధికారులు నిర్ధారించారు.
బ్యాంకాక్‌లో సబ్వే (పర్పుల్ లైన్) నిర్మాణం పక్కన ఉన్న భూమి కుంచుకుపోవడం వల్ల ఈ సింక్‌హోల్ సంఘటన జరిగిందని ఇతర పరిశోధనల్లో వెల్లడైంది. రోడ్డు కుంగిపోవడంతో విద్యుత్ స్తంభాలు, కార్లు, మౌలిక సదుపాయాలు నేలకూలాయి. స్థానిక నివేదికలు, అంతర్జాతీయ మీడియా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని నిర్ధారించాయి.
ఢిల్లీలో అలాంటి సంఘటన ఏదైనా జరిగిందా అని తెలుసుకోవడం కోసం మేము వెతుకుతున్నప్పుడు, విశ్వసనీయ మీడియా వర్గాలు ఇటీవల నివేదించిన అలాంటి సంఘటనలు ఏవీ మాకు కనిపించలేదు. కనుక, వైరల్ వీడియో ఢిల్లీలో రోడ్డు కూలిపోవడాన్ని చూపించడం లేదు. బ్యాంకాక్‌లోని వజీరా హాస్పిటల్ వెలుపల 2025 సెప్టెంబర్ 24న జరిగిన సింక్‌హోల్ ఏర్పడ్డ ఘటనను చూపిస్తుంది. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : ఢిల్లీలో ఒక రోడ్డు కూలిపోయి సింక్ హోల్ ఏర్పడ్డట్టుగా వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By : Facebook Users
Fact Check : Unknown