ఫ్యాక్ట్ చెక్: షిర్డీ సాయి బాబా ఆలయానికి వచ్చిన విరాళాన్ని ముస్లింలు తీసుకుని వెళుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
షిర్డీ సాయి బాబా ఆలయానికి వచ్చిన విరాళాన్ని ముస్లింలు తీసుకుని వెళుతున్నారంటూ
సినీ నటి మాధవీలత షిరిడీ సాయిబాబాను ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు అందింది. ఆమె చేసిన వ్యాఖ్యలు సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ పలువురు పోలీసులను ఆశ్రయించారు. కేవలం మాధవీలతపైనే కాకుండా, ఆ వీడియోలను వైరల్ చేసిన కొందరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు, ఇతర సోషల్ మీడియా వ్యక్తులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
సాయి బాబా గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, భక్తుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని, అవమానకరమైన సందేశాలు వ్యాప్తి చెందుతున్నాయని ఆరోపిస్తూ షిర్డీ సాయి భక్తుల యునైటెడ్ ఫోరం దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మత ప్రచారకులమని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు, సంకుచిత మనస్తత్వం, స్వార్థ ప్రయోజనాలతో, ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన, కల్పిత విష ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్నారు. ఫలితంగా, కోట్లాది మంది భక్తులు రోజూ మానసిక క్షోభను అనుభవిస్తున్నారని ఫిర్యాదుదారులు తెలిపారు. షిర్డీ సాయి బాబాను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు పూజిస్తున్నారని, అయితే ప్రతిరోజూ అవమానకరమైన భాషతో, తప్పుడు ప్రచారం ద్వారా అవమానిస్తే భక్తుల సహనం నశించిపోతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంతలో షిర్డీ సాయి బాబాకు భక్తులు విరాళంగా ఇచ్చిన సొమ్ము ఇదేనని, ఓ మతానికి చెందిన వాళ్లు ఆ డబ్బును తీసుకుని వెళుతూ ఉన్నారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"షిర్డీ సాయి జేబులో పెట్టిన హిందువుల సొమ్ము ఎక్కడికి పోతుందో మీరే చూడండి! కళ్లున్నప్పటికీ అంధుడిగా మారిన దేశంలోని ప్రతి హిందువుకు చేరేలా దీన్ని వైరల్ చేయాలి" అంటూ వాట్సాప్ లో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ వీడియోలో ఇస్లామిక్ టోపీలు ధరించిన వ్యక్తులు విరాళాల పెట్టె నుండి నగదును సేకరించి వాటిని గోనె సంచులలో ఉంచడం చూడవచ్చు.
వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మాకు কিশোরগঞ্জ ভিউস అనే ఫేస్ బుక్ పేజీలో మే 6, 2023న అదే వీడియోను పోస్టు చేసినట్లు గుర్తించాం. నిడివి ఎక్కువ ఉన్న వీడియోను మేము గుర్తించాం. ఇప్పుడు వాట్సాప్ లో వైరల్ అవుతున్న వీడియో ఇక్కడ అప్లోడ్ చేసిన వీడియో ఒకటేనని తెలుస్తోంది.
ఇది బంగ్లాదేశ్ లోని కిషోర్‌గంజ్ పాగ్లా మసీదుకు సంబంధించిందంటూ పోస్టుల్లో తెలిపారు. కిషోర్‌గంజ్‌లోని చారిత్రాత్మక పాగ్లా మసీదులోని ఎనిమిది విరాళాల పెట్టెలు నాలుగు నెలల తర్వాత తెరిచారని, ఈసారి రికార్డు స్థాయిలో 5 కోట్ల 59 లక్షల 7 వేల 689 టాకా విరాళాలు పెట్టెల్లో వచ్చాయని తెలిపారు. విదేశీ నాణేలు, బంగారు ఆభరణాలు కూడా అందులో ఉన్నాయన్నారు. దాదాపు 13 గంటల్లో 200 మంది ఈ డబ్బును లెక్కించేందుకు పనిచేశారని పోస్టులో వివరించారు.
మేము కీవర్డ్ సెర్చ్ చేయగా పాగ్లా మసీదుకు భారీ విరాళాలు వస్తూ ఉంటాయని పలు మీడియా కథనాలు తెలిపాయి. బంగ్లా మీడియా సంస్థలకు చెందిన యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇదే వీడియోను మేము కనుగొన్నాం.
గతంలో పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా ఈ వీడియోపై నిజ నిర్ధారణ చేశాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
బంగ్లాదేశ్ లోని ఓ మసీదుకు వచ్చిన విరాళాలకు సంబంధించిన వీడియోను షిర్డీ సాయి ఆలయానికి వచ్చిన విరాళాలు అంటూ మరోసారి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : బంగ్లాదేశ్ లోని ఓ మసీదుకు చెందిన వీడియోను షిర్డీ సాయి బాబా ఆలయానికి సంబంధించినదిగా ప్రచారం చేస్తున్నారు
Claimed By : Social Media Users
Fact Check : Unknown