ఫ్యాక్ట్ చెక్: ఏఐ ద్వారా సృష్టించిన వీడియోను నిజంగా ఏనుగు మనిషిపై దాడి చేసిన ఘటనగా షేర్ చేస్తున్నారు
ఏఐ ద్వారా సృష్టించిన వీడియోను నిజంగా ఏనుగు మనిషిపై దాడి చేసిన ఘటనగా
ఝార్ఖండ్ రాష్ట్రంలో ఓ ఏనుగు రెచ్చిపోయింది. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో ఒక అడవి ఏనుగు ప్రాణాంతకంగా దాడి చేయడంతో 22 మంది మరణించారు. జార్ఖండ్ ప్రభుత్వం ఎలిఫెంట్ ఎమర్జెన్సీని ప్రకటించింది. మంద నుండి వేరైన ఏనుగు దూకుడుగా ప్రవర్తిస్తోంది. ఇప్పటివరకు 22 మందిని చంపిందని, రోజుకు దాదాపు 30 కిలోమీటర్లు తిరుగుతుందని అటవీ అధికారులు తెలిపారు.
జంతువును ట్రాక్ చేసి పట్టుకోవడానికి అటవీ శాఖ 100 మందికి పైగా సిబ్బందిని నియమించింది. మూడుసార్లు ఏనుగును శాంతపరచడానికి ప్రయత్నించారు, కానీ ఫలితం లేకపోయింది. ఏనుగు టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరిగినప్పుడు కోపంగా, ప్రమాదకరంగా వ్యవహరిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు జంతువు ప్రవర్తన సాధారణ స్థాయికి రావడానికి చాలా రోజులే పడుతుందని నిపుణులు తెలిపారు.
ఒక ఏనుగు ఒక వ్యక్తిపై దాడి చేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో ఏనుగు ఆ వ్యక్తిని తన తొండంతో ఎత్తి ఇంటి గోడకు కొట్టి, భవనం ప్రవేశ ద్వారం దెబ్బతీసినట్లు చూడొచ్చు.
ఈ ఘటన ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకుందంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఆర్కైవ్ లింక్స్ కు సంబంధించిన సమాచారం ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.
వైరల్ వీడియో లోని స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అయితే మాకు ఎక్కడా కూడా ఈ విజువల్స్ తో మీడియా కథనాలు లభించలేదు. ఈ సంఘటన నిజమైతే, విశ్వసనీయ వార్తా సంస్థలు లేదా పలు వీడియో ప్లాట్‌ఫారమ్‌ల కవరేజ్ ఉండే అవకాశం ఉంది.
వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా ఆ వీడియోలో మనుషుల కదలికలు, అక్కడ ఉన్న వ్యక్తుల హావభావాలు తేడాగా అనిపించాయి. ఇవి చాలా వరకూ ఏఐ జనరేటెడ్ వీడియోల్లో కనిపించేవి. దీన్ని బట్టి ఇది ఏఐ సృష్టి అనే అనుమానాలు బలపడ్డాయి.
మా తదుపరి పరిశోధనలో NATURE FURVER అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన వీడియో మాకు లభించింది. జనవరి 14న ఈ ఖాతా ద్వారా షేర్ చేసిన వీడియో వైరల్ పోస్ట్‌లో ఉన్న క్లిప్ కు మూలంగా భావించాం. అదే హ్యాండిల్ లోని ఇతర పోస్ట్‌లను పరిశీలించగా ఈ ఖాతాలో AI- జనరేటెడ్ కంటెంట్‌ను ఎక్కువగా పోస్టు చేశారని తెలుస్తోంది.
వైరల్ వీడియో ఉన్న పేజీకి సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఇక మేము ఈ వీడియోను ఏఐ డిటెక్షన్ టూల్స్ సాయంతో సెర్చ్ చేశాం. ఆ టూల్స్ ఈ వీడియోను ఏఐ ద్వారా సృష్టించినట్లుగా తేల్చారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారని స్పష్టంగా తెలుస్తోంది.
Claim : ఏఐ ద్వారా సృష్టించిన వీడియోను నిజంగా ఏనుగు మనిషిపై దాడి చేసిన ఘటనగా
Claimed By : Social Media Users
Fact Check : Unknown